ఉప ఎన్నికల బరిలో తెలుగు బిగ్ బాస్ ఫేం

0

ఇటీవల అనారోగ్యంతో దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతితో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు అధికారిక టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో సందడి చేసిన మాజీ టీవీ యాంకర్ కత్తి కార్తీక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగింది.

ఇప్పటికే కార్తీక అక్కడ తిరుగుతూ ప్రచారం మొదలు పెట్టారు. వీ6 లో యాంకర్ గా అలరించడంతో పాటు బిగ్ బాస్ షో లో తెలంగాణ యాసతో మాట్లాడి స్వీట్ అండ్ సింపుల్ అంటూ పేరు తెచ్చుకుంది. వివాదాలకు తావు లేకుండా షో లో కొనసాగిన కత్తి కార్తీక ఆ తర్వాత కూడా ప్రేక్షకుల హృదయాల్లో ఉంది. ప్రస్తుతం తన వ్యాపారాలతో బిజీగా ఉన్న కార్తీక ఉన్నట్లుండి స్వతంత్రురాలిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవ్వడంతో చర్చనీయాంశం అవుతోంది.

మాజీ మంత్రి పద్మారావుకు బంధువు అయిన కార్తీక గతంలో రాజకీయ నేపథ్యం అయితే కలిగి లేదు. అయితే దుబ్బాక ప్రజలు తనను గెలుపొందిస్తే తప్పకుండా వారు కోరుకున్నవి జరిగేలా చేస్తానంటూ హామీ ఇస్తుంది. కత్తి కార్తీక ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో ప్రపభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కత్తి కార్తీక ఉప ఎన్నికల్లో గెలిస్తే సంచలనం అవుతుంది అనడంలో సందేహం లేదు.