ఈసారి ‘కేజీఎఫ్ 2’ కి కష్టమే…!

0

సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. దేశ వ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన ‘కేజీఎఫ్’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రానున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రంగా.. బాలీవుడ్ లో సత్తా చాటిన సౌత్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ‘కేజీఎఫ్’ నిలిచింది. అయితే దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కి మాత్రం ఈసారి ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడం కష్టమే అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడలో కంటే మిగతా భాషల్లో ఎక్కువగా కలెక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 కి బాగా కలెక్షన్స్ వచ్చాయి. దీంతో పాటు టాలీవుడ్ లో కూడా అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఇక తమిళంలో ‘కేజీఎఫ్’ ని పెద్దగా పట్టించుకోలేదు. మలయాళంలో కూడా దాదాపుగా సేమ్ పొజిషన్. అందుకే ‘కేజీఎఫ్ 2’ని టాలీవుడ్ బాలీవుడ్ మార్కెట్స్ ని దృష్టిలో పెట్టుకొని మరింత భారీ రేంజ్ లో తీయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో సంజయ్ దత్ – రవీనా టాండన్ – ప్రకాష్ రాజ్ – మాళవిక లాంటి స్టార్ క్యాస్టింగ్ వచ్చి చేరింది.

అయితే ఎంత భారీగా తీసినా సొంత లాంగ్వేజ్ లో మార్కెట్ ని బట్టే మిగతా వాటిల్లో మార్కెట్ ఉంటుంది. కానీ ‘కేజీఎఫ్’ కన్నడలో సాధించిన లెక్కలు చూసుకుంటే ‘కేజీఎఫ్ 2’ బిజినెస్ ఈసారి కన్నడలో పెద్దగా జరగకపోవచ్చనే అనుకుంటున్నారు. ‘కేజీఎఫ్ 2’ మేకర్స్ ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి మెయిన్ రీజన్ తెలుగు మరియు హిందీ ఇండస్ట్రీలో జరిగే బిజినెస్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రమే. అయితే ఈ క్రైసిస్ టైమ్ లో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలే డైరెక్ట్ ఓటీటీ బాట పడుతున్నాయి. రాబోయే రోజుల్లో థియేటర్స్ ఓపెన్ అయినా ఓ కన్నడ హీరో సినిమాకి ఏమాత్రం థియేటర్స్ ఇస్తారో చూడాలి.