Templates by BIGtheme NET
Home >> Cinema News >> మా నాన్న వడ్రంగి.. దీపావళి టపాసులు కూడా కొనలేని పరిస్థితి: బ్రహ్మానందం

మా నాన్న వడ్రంగి.. దీపావళి టపాసులు కూడా కొనలేని పరిస్థితి: బ్రహ్మానందం


legendary comedian brahmanandam valuable words about money

legendary comedian brahmanandam valuable words about money

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం డబ్బుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారని.. డబ్బును ఆయన అస్సలు వృథాగా ఖర్చుచేయరనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయన పిసినారి అని చాలా మంది అంటుంటారు. అయితే, తాను డబ్బు విషయంలో ఇలా ప్రవర్తించడానికి గల కారణాన్ని ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. డబ్బును వృథా చేయడం తనకు అస్సలు ఇష్టముండని తేల్చి చెప్పారు. తాను ఇలా ఉండటానికి కారణం తన జీవితంలోని సంఘటనలే అని వెల్లడించారు.

‘‘డబ్బులు ఖర్చుపెట్టడమంటే పార్టీలు ఇవ్వడం, ఫంక్షన్లు నిర్వహించడం, సరదాలు, షికార్లు, పిక్‌నిక్‌లు అని చాలా మందిలో ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వాటితో బ్రహ్మానందం మింగిల్ అవ్వడు. అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నాకు డబ్బు విలువ తెలుసు. వడ్రంగం పనిచేసే మా నాన్న.. పది మంది పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పి వాళ్లు ఇచ్చే డబ్బుతో పెద్ద సంసారాన్ని గడిపారు. నా వయసు ఏడెనిమిది సంవత్సరాలు ఉంటుంది. దీపావళి పండుగ వచ్చింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి గురించి పిల్లలం మాకు తెలీదు.

అందరు పిల్లలు మాదిరిగానే దీపావళి మందుగుండు సామానులు కొనుక్కోవాలని నాన్నను వేధించేవాళ్లం. నాన్న ఏం చేయలేక రెండు తన్ని కూర్చోబెట్టేవారు. అయినప్పటికీ, మా బాధను భరించలేక ఒకసారి నన్ను తీసుకొని ఆయన పనిచేస్తోన్న ఆస్థానం దగ్గరకు వెళ్లారు. అక్కడ పనిచేస్తున్నాను కదా అనే చిన్న క్వాలిఫికేషన్‌తో యజమానిని డబ్బులు అడిగి మాకు దీపావళి టపాసులు కొనివ్వాలనే ఆలోచనతో ఆయన వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్లారు.

మా నాన్నతో పాటు నేను వెళ్లినప్పుడు అక్కడ పెద్ద బంగ్లా ఉంది. పంచ, ఒక మామూలు చొక్కా, పైపంచ వేసుకుని మా నాన్న వెళ్తే, ఆయనతో పాటు ఒక నిక్కరు, చొక్కా వేసుకున్న పిల్లాడు వేలుపట్టుకుని నిలబడ్డాడు. వరండాలో నిలబడి ఉంటే మా నాన్న చూపులు ఎదురుగా ఉన్న మెట్లపై ఉన్నాయి. యజమాని మెట్ల మీద నుంచి దిగి వస్తాడని వేచి చూస్తున్నారు. ఆయన ఎప్పుడొస్తాడు అనేది ఒక ఆలోచన.

వచ్చినవాడు.. ‘ఏవయ్యా వేళాపాళా లేదా, బుద్ధి జ్ఞానం లేదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి’ అని అంటాడేమో? ఏం చేయాలి? అనేటటువంటి మానసిక వేదన, మానసిక సంఘర్షణ, మానసికంగా మా నాన్న పడేటటువంటి ఆవేదన చిటికన వేలు పట్టుకుని నిలబడిన పిల్లాడి మీద ప్రతిఫలించింది. ఆ ఆలోచన పిల్లాడి గుండెల మీద స్వారీ చేసింది.

నాన్న దయనీయమైన చూపుతో మెట్ల వైపు చూస్తుంటే.. పై నుంచి వస్తోన్న ఆయన ‘ఏవయ్యా నాగలింగం ఏంటి ఇలా వచ్చావ్?’ అంటే.. ‘ఏం లేదండి ఈరోజు దీపావళి కదా పిల్లలు..’ అంటూ మా నాన్న చేతులు నలుపుకుంటూ మాట్లాడుతుంటే.. అరేయ్, ఆయనకి ఏమైనా ఇచ్చి పంపించండి అని యజమాని అన్నప్పుడు.. మా నాన్న ముఖంలో సంతోషం చూశాను. డబ్బులేని తనం, డబ్బులేకపోతే ఎవరిదగ్గరికైనా వెళ్లి దేవిరించినతనం అనే బాధ అప్పటి నుంచి నా కడుపులో ఉండిపోయింది.

సామాన్య మానవుడు ఎవడూ ఇలా బాధపడకూడదు. అంతో ఇంతో డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే మనల్ని గౌరవిస్తారు. కేవలం డబ్బు వల్లే ఈ సమాజంలో గౌరవం దక్కుతుంది. తెలివితేటలు వల్లో మరొకటి చూసో గౌరవం ఇవ్వరు. అందుకే, డబ్బును నేను అంత అతిగా గౌరవించేవాడిని. ఊరకనే అల్లరి చిల్లరిగా డబ్బు ఖర్చుపెట్టేవాడిని కాదు. డబ్బు దగ్గర ఎవ్వరైనా జాగ్రత్తగా ఉంటారు. నేనూ జాగ్రత్తగా ఉంటాను.. ఉండాలి. కానీ, అనవసరమైన వాటి కోసం నేను దానం చేయను’’ అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. తాను తన కుటుంబంలో 23 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశానని, తాను చదివించిన ఆరుగురు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని బ్రహ్మానందం వెల్లడించారు.