తమన్ పై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అదేనా…?

0

సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా పోస్టులు పెడుతున్న అప్పుడప్పుడు నెటిజన్స్ చేసే ట్రోల్స్ కి గురవుతుంటారు. అందుకే సెలబ్రిటీలు అందరూ ఆచితూచి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. ఇంకా హీరోల విషయంలో పెట్టే ట్వీట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే తమ అభిమాన హీరో గురించి పెట్టే ట్వీట్ లో చిన్న వర్డ్ నచ్చకపోయినా.. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ట్వీట్ వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితే కొని తెచ్చుకున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మోషన్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు నాలుగు రోజుల ముందే ఫ్యాన్స్ ని ఎక్సయిట్మెంట్ కి గురిచేశాడు. అదే సమయంలో మహేష్ బాబు.. కరోనా వేగంగా విస్తరిస్తున్న కారణంగా సామూహిక వేడుకలు జరుపుకోవద్దని.. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న యుద్ధంలో సురక్షితంగా ఉండడం అన్నింటికన్నా ముఖ్యమని.. నా పుట్టినరోజున అభిమానులంతా వేడుకలకి దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని ట్విట్టర్ లో మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన తమన్.. ”గొప్ప నిర్ణయం బ్రదర్” అని పేర్కొన్నారు. అయితే ఇదే కొంత మంది మహేష్ అభిమానులకు కోపం తెప్పించింది.

మహేష్ బాబుని బ్రదర్ అని పిలవడం వారికి నచ్చలేదు. ఎప్పుడు మహేష్ బాబు ని ‘సార్’ అని పిలిచే తమన్ ఇప్పుడు ‘బ్రదర్’ అని పిలవడంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ”మహేష్ బాబుని బ్రదర్ అని పిలిచేటంత పెద్ద వాడివి అయిపోయావా..” ”ఎప్పుడు సార్ అని పిలిచే నువ్వు బ్రదర్ అని పిలుస్తున్నావా?” ”నీకు చాలా బలిసింది” అంటూ తిట్ల దండకాన్ని అందుకున్నారు. ”థమన్ నీకు చివరి సారిగా చెప్తున్న ఇంకొక సారి మహేష్ (DEMI GOD) ని BROTHER అని పిలిస్తే నీకు పగలకపోతే నన్ను అడగరా” అని కొంతమంది వార్నింగ్ కూడా ఇచ్చారు. నిజానికి తమన్ మహేష్ గురించి ఎప్పుడు ట్వీట్ చేసినా ‘సార్’ అనే సంభోదించేవారు.

ఇదిలా ఉండగా మెజారిటీ మహేష్ ఫ్యాన్స్ ‘సర్కారు వారి పాట’ సినిమాకి తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవద్దంటూ మేకర్స్ ని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసారు. దీనికి కారణం సంక్రాంతి వార్ లో మహేష్ సినిమాకి పోటీగా రిలీజ్ చేసిన బన్నీ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించడంతో పాటు.. ‘అల వైకుంఠపురంలో’ సక్సెస్ మీట్ లో ‘రేస్ లో కష్టపడి పరుగెత్తాను.. చివరికి నేనే గెలిచాను’ అనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేసారు తమన్. అప్పటికే ‘సంక్రాతి విన్నర్’ ‘సంక్రాంతి మొగుడు’ వార్ నడుస్తుండగా.. తమన్ వ్యాఖ్యలు మహేష్ అభిమానులను మరింత రెచ్చగొట్టినట్లుగా చేసాయి. అప్పటి నుంచి తమ హీరో సినిమాకి తమన్ ని తీసుకోవద్దని ఫ్యాన్స్ అభ్యర్థిస్తూ వచ్చారు. కానీ చివరికి థమన్ నే ‘సర్కారు వారి పాట’కి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మీద కూడా మహేష్ ఫ్యాన్స్ నిరాశ చెందారని టాక్ నడుస్తోంది. తమన్ గత చిత్రాలకు ఇచ్చినట్లే ఇచ్చాడని.. కొత్తగా ఏమీ లేదని కామెంట్స్ పెడుతున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యేలోపు తమన్ మహేష్ ఫ్యాన్స్ మెప్పు పొండుతాడేమో చూడాలి.