ప్లాప్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ కి మహేష్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా…?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాని ప్రకటించారు మహేష్. తన కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ పై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే దీని తర్వాత మహేష్ బాబు నటించే సినిమాపై అప్పుడే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

కాగా మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న రాజమౌళి మహేష్ తో జత కట్టడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి ముందే మహేష్ బాబు ఒకటి లేదా రెండు సినిమాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ కి ప్లాప్ సినిమా ఇచ్చిన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. గతంలో మురుగదాస్ – మహేష్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాలతో వచ్చిన ‘స్పైడర్’ మూవీ ఊహించని ఫలితాన్ని అందుకుంది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ కెరీర్ లో ప్లాప్ మూవీ ఇచ్చిన మురగదాస్ తోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండనుందని రూమర్స్ మొదలయ్యాయి. మహేష్ బాబుకి మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చే వరకు ట్విట్టర్ వాల్ లో ‘స్పైడర్ లోని మహేష్ ఫోటో’ని తీయమని చెప్పిన మురగదాస్.. ఒక స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని.. త్వరలోనే మహేష్ కి చెప్పబోతున్నారని అనుకుంటున్నారు. దీంట్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.. మహేష్ కి ఆల్రెడీ ప్లాప్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ ని నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా అని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. మహేష్ హిట్స్ ఉంటేనే అవకాశం ఇస్తాడని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ప్రముఖ డైరెక్టర్ ఒకరు పబ్లిక్ గానే ఈ విషయం చెప్పారు. అలాంటిది ఇప్పుడు ‘స్పైడర్’ సినిమా ఇచ్చిన మురగదాస్ తో మరో ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకుంటాడా అని చర్చించుకుంటున్నారు.