నెగెటివ్ రోల్స్ చేస్తానంటున్న సీనియర్ హీరోయిన్…!

0

సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనా ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. రజనీకాంత్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ.. ఇలా అప్పట్లో సౌత్ లో ఉన్న అగ్ర హీరోలందరి సరసన నటించింది మీనా. అయితే వివాహం చేసుకుని స్థిరపడిన తర్వాత సినిమాల్లో జోరు తగ్గించింది. కాకపోతే అవకాశం వచ్చినప్పుడు వయసుకు సరిపడే పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లందరూ చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తుంటే మీనా మాత్రం ఇప్పటికీ ప్రధాన పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తెలుగులో ఆమె చివరిగా వెంకటేష్ సరసన ‘దృశ్యం’ మరియు ‘సాక్ష్యం’ మూవీలో హీరో తల్లి పాత్రలో నటించారు.

కాగా సీనియర్ హీరోయిన్ మీనా వెబ్ వరల్డ్ లో కూడా అడుగులు వేశారు. జీ5 ఒరిగినల్స్ లో ప్రసారమైన ‘కరోలిన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసింది. ఈ క్రమంలో విలన్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే అంటోంది ఈ సీనియర్ నటి. ఇటీవల మీనా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ దొరికితే చేయాలని ఉందని తన కోరికను వెలిబుచ్చింది. ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ – సిమ్రాన్ లాంటి వారు ప్రతినాయకి ఛాయలున్న పాత్రల్లో నటించి సక్సెస్ అయ్యారు. నేటి తరం హీరోయిన్స్ లో కూడా త్రిష – వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి వారు నెగిటివ్ రోల్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అలనాటి అందాల తార మీనా కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి రెడీ అంటోంది. మరి ఈ సీనియర్ హీరోయిన్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే మీనా ప్రస్తుతం మలయాళంలో ‘దృశ్యం-2’ మరియు తమిళ్ లో రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటిస్తోంది.