లెక్కల మాస్టారు లెక్కల్లో మార్పులు ఉండబోతున్నాయా…?

0

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ సినిమాలను తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ లెక్కల మాస్టారు తన సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తూ వస్తున్నాడు.’ఆర్య’ ‘ఆర్య 2’ ‘100% లవ్’ ‘1 నేనొక్కడినే’ ‘రంగస్థలం’ చిత్రాల ద్వారా తన స్టామినా ఏంటో చూపించాడు. ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ రెమ్యూనరేషన్ కూడా మారిపోయిందని టాక్ వచ్చింది. ప్రస్తుతం సుక్కు అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది.

కాగా ‘పుష్ప’ సినిమా కోసం సుకుమార్ భారీగానే తీసుకుంటూ అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఈ మూవీ కోసం సుమారు 22 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమో కాదో అనేది పక్కన పెడితే ప్రస్తుత కరోనా క్రైసిస్ పరిస్థితుల్లో మేకర్స్ అందరూ సినిమా బడ్జెట్ లో కోతలు విధించే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు టెక్నీషియన్స్ స్వచ్చంధంగా తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సుకుమార్ కూడా ముందు అనుకున్న దాని కంటే తక్కువే తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ప్రశార్థకంగా మారింది. అందులోనూ ‘పుష్ప’ మెజారిటీ భాగం ఎక్కువ మంది సిబ్బందితో అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అందువల్ల మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణిలోనే ఉండాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోందని సమాచారం.