Templates by BIGtheme NET
Home >> Cinema News >> మెగా ఫ్యామిలీకి మాస్కులు అక్కర్లేదా?

మెగా ఫ్యామిలీకి మాస్కులు అక్కర్లేదా?


కరోనా వేళ.. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్న వారే. ఇలాంటివేళలో నిర్వహించే వేడుకల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా నటుడు నాగబాబు కుమార్తె కమ్ కథానాయిక నిహారిక నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరగటం తెలిసిందే. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో రెండు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే పాల్గొన్న ఈ వేడుకకు చెందిన ఫోటోలు బయటకు వచ్చాయి.

అనూహ్యంగా.. ఈ ఫోటోల్లో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరూ మాస్కులు పెట్టుకోకుండా ఫోటోలు దిగటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఎంత మెగా ఫ్యామిలీ అయితే మాత్రం మాస్కులు పెట్టుకోరా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.. గ్రూపు ఫోటోలో దాదాపు పద్దెనిమిది మంది వరకు ఉండటం.. అందరూ చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. ఇలాంటివేళ.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మాస్కులు లేకుండా ఉండటం సరికాదంటున్నారు.

ప్రముఖులు.. సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే వేడుకల విషయంలో అందరికి ఆసక్తి ఉంటుంది. వారిని అనుకరించే సామాన్యులు కోట్లల్లో ఉంటారు. ఎంత కుటుంబ సభ్యులైతే మాత్రం.. అందరూ ఒకే ఇంట్లో ఉండరు కదా? వేర్వేరుగా ఉండే కుటుంబాల వారు ఒక చోటకు చేరినప్పుడు..కరోనా లాంటి టైంలో మాస్కులు ధరించటం చాలా ముఖ్యం. మాస్కులు ధరించటం ద్వారా.. సమాజానికిచక్కటి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. అంత పెద్ద మెగా ఫ్యామిలీలోనే వేడుకలో మాస్కులు పెట్టుకొని ఫోటోలు దిగారు.. మనమెంత? అన్న భావన సామాన్యుల్లో అంతో ఇంతో బాధ్యత పెంచుతుందన్నది మర్చిపోకూడదు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండే మెగాస్టార్ చిరు.. ఆయన సోదరుడు నాగబాబు.. తన ఇంట్లో జరిగే వేడుకలో మాస్కుల్ని ధరించాలన్న విషయాన్ని చెప్పటం.. చేసి చూపించటంలో సరిగా వ్యవహరించలేదన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.