Templates by BIGtheme NET
Home >> Cinema News >> మిస్ ఇండియా ట్రైలర్ టాక్

మిస్ ఇండియా ట్రైలర్ టాక్


నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ”మిస్ ఇండియా”. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించారు. ఏప్రిల్ 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదాపడి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ‘మిస్ ఇండియా’ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘మిస్ ఇండియా’ ట్రైలర్ చూస్తుంటే మహిళా వ్యాపారవేత్తగా నిరూపించుకోవాలని తపన పడే మధ్య తరగతి యువతి కథ అని తెలుస్తోంది.

‘పెద్దయ్యాక ఏమవుతావ్?’ అని ఒక చిన్నమ్మాయికి ప్రశ్నించగా.. ‘ఎంబీఏ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాను’ అని చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అయింది. భారతదేశంలో ప్రాచుర్యం పొందిన టీ(చాయ్) ని విదేశాల్లో అమ్మి సక్సెస్ సాధించాలనుకునే సంయుక్త అనే యువతి పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఆమె తన కలను సాకారం చేసుకోడానికి ఎంత దూరం వెళ్ళింది.. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.. వాటితో ఫైట్ చేసి ఎలా సక్సెస్ అయింది అనేది ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. మరోసారి కీర్తి సురేష్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తోందని అర్థం అవుతోంది. ‘నిజానికి చాలా దూరంగా అబద్దానికి చాలా దగ్గరగా బ్రతుకుతున్నావ్.. నువ్వు అన్నయ్య జాబ్ చేస్తే తప్ప మన ఇల్లు సరిగా గడవదు.. అలాంటిది నువ్ బిజినెస్ చేయడం’ అని తల్లి పాత్ర చెప్పడం.. ‘బిజినెస్ అనేది నీ మాటల్లో నుంచి కాదు.. నీ మనసులో నుంచి కూడా పూర్తిగా తీసేయ్’ అని అన్నయ్య పాత్ర హెచ్చరించడం వంటివి సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తెలియజేస్తోంది.

‘జీవితంలో మనం చేసే ఏ పనైనా ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదు.. ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం’ ‘బిజినెస్ అనేది ఆడపిల్లలు ఆడుకునే ఆట కాదు.. బిజినెస్ అంటే వార్’ అనే డైలాగ్స్ ద్వారా సంయుక్త బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ అవ్వడానికి స్ఫూర్తినిచ్చే వారితో పాటు అడ్డంకులు సృష్టించే వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. చివరగా ‘మిస్ ఇండియా అంటే నేను కాదు.. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్’ అంటూ ట్రైలర్ ముగించారు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర – జగపతి బాబు – రాజేంద్ర ప్రసాద్ – సీనియర్ నరేష్ – నదియా – కమల్ కామరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ‘మిస్ ఇండియా’ కి థమన్ సంగీతం అందించారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నవంబర్ 4న విడుదలకానుంది.