‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీజర్

0

విజయదశమి పర్వదినం సందర్భంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌ చేశారు. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా మీద టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన డైలాగులతో ఇంట్రస్టింగ్‌గా టీజ‌ర్‌ కట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్2 బ్యానర్లో తెరకెక్కుతోందీ సినిమా. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు.

బ్యాచిలర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మోస్ట్ ఎలిజిబుల్ అని అందంగా ట్యాగ్ అయితే తగిలిస్తారు కానీ.. ఒకసారి అమ్మాయి ప్రేమలో పడితే మాత్రం ఆ కష్టాలు వర్ణణాతీతం. ఇక ఆరోజు నుంచి తన కోసం కాకుండా ప్రేయసి కోసమే బతకాల్సి వస్తే ఇక ఆ సంఘర్షణ ఆషామాషీగా ఉండదు.

ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే చెప్పులా పడుండాలి! అని భావించే ప్రేయసి తగిలిందంటే ఇక ఆ కష్టాలు కూడా చెప్పతరమా? ఇదిగో ఇక్కడ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ పరిస్థితి కూడా అలానే ఉంది. నిజానికి అఖిల్ రియల్ లైఫ్ కష్టాన్నే ఇలా చూపిస్తున్నారా? అన్నట్టుగా ఈ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ ఆద్యంతం అవే విషయాల్ని పదే పదే గుర్తు చేస్తోంది.

ప్రియురాలు అంటే ఎడ్డెం అంటే తెడ్డెం అనే టైపే. అందంగా ఉంటుంది. అందంగా కవ్విస్తుంది. ఇంకా ఎంతో అందంగా గుండెల్ని కోసేస్తుంది. ఇదిగో ఇక్కడ బ్యాచిలర్ గారి ప్రేయసి కూడా అంతే అందంగా కవ్వించి కోసేస్తోంది. అర్థం చేసుకునేవాళ్లకు చేసుకున్నంత. అనుభవం అయిన వాళ్లకు అయినంతా! అన్నట్టుగానే ఉంది ఆవిడ వ్యవహారం. అఖిల్ ఇస్మార్ట్ గా కనిపిస్తున్నాడు టీజర్ లో.. ఇక బుట్టబొమ్మ ఫీట్ మరోసారి రిపీట్ చేస్తూ పూజా హెగ్డే అదరగొట్టేస్తోంది. అందమైన జంట ట్రీట్ ఓ రేంజులోనే ఉండబోతోందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే మూడు తప్పటడుగుల తర్వాత అఖిల్ నాలుగో ప్రయత్నం చేస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే ఆశలన్నీ. అటు నాగార్జున .. ఇటు జీఏ2 బ్యాచ్ .. అటు భాస్కర్ అందరికీ సవాల్ లాంటిదే ఈ ప్రయత్నం. అందుకే అఖిల్ అభిమానుల్లో.. టోటల్ అక్కినేని అభిమానుల్లో ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. పోస్టర్లు టీజర్ ఆకట్టుకున్నట్టే మొత్తం సినిమా కూడా బ్లాక్ బస్టర్ అన్న టాక్ రావాలి మరి. 2021 సంక్రాంతికి వస్తారా.. 2020 క్రిస్మస్ కి దిగిపోతాడా? అన్నది కూడా ప్రకటించాల్సి ఉంది ఇంకా.