Templates by BIGtheme NET
Home >> Cinema News >> షాదీకి రెడీ అవుతున్న ‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు

షాదీకి రెడీ అవుతున్న ‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు


ఆర్కే నాయుడు అనే పేరు వినగానే ‘మొగలి రేకులు సీరియల్ గుర్తొస్తుంది. అంతగా ఆ సీరియల్లో ఆ పాత్ర పాపులర్ అయింది. పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్ర ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆ నటుడి పేరే ‘సాగర్’. ‘చక్రవాకం’ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ ఆ తరువాత ‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా ఆ క్రేజ్ ను చాలాకాలం పాటు కొనసాగించాడు. ఇప్పటికీ ఆయనను ఆర్కే నాయుడుగానే ప్రేక్షకులు గుర్తిస్తారు. బుల్లితెరపై స్టార్ డమ్ ను సంపాదించుకున్న చాలామంది వెండితెర దిశగా అడుగులు వేశారు. సాగర్ కూడా అదే రూట్లో ముందుకువెళ్లాడు.

సాగర్ మంచి పొడగరి .. అందుకు తగిన పర్సనాలిటీతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. బుల్లితెరపై అతణ్ణి చూసినప్పుడే అతనిలో ఒక మాస్ హీరోకు కావలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయని చెప్పుకున్నారు. దాంతో సాగర్ ఆ దిశగానే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. హీరోలకి స్నేహితుడిగా ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన సాగర్ ఆ తరువాత హీరోగానే ఎంట్రీ ఇచ్చాడు. ఆయన హీరోగా చేసిన ‘సిద్ధార్థ’ కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సరైన పబ్లిసిటీ లేని కారణంగా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత మంచి కథ కోసం వెయిట్ చేసిన సాగర్ ‘షాదీ ముబారక్’ సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

‘దిల్’ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి రానున్న ఈ సినిమా ద్వారా ‘పద్మశ్రీ’ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ద్వారా ‘దృశ్య రఘునాథ్’ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా నుంచి మరో నాలుగైదు రోజుల్లో ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాలవారికి బాగా నచ్చుతుందనీ తన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని సాగర్ భావిస్తున్నాడు. తాను ఇంతకాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ ఈ సినిమాతో పడుతుందని ఆయన నమ్ముతున్నాడు. న్యూ ఇయర్ ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి మరి.