మెగాస్టార్ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కలెక్షన్ కింగ్…!

0

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి – డైలాగ్ కింగ్ మోహన్ బాబు లది ప్రత్యేకమైన అనుబంధం. ఒకప్పుడు ఇద్దరూ మిత్రులో.. శత్రువులో అర్థంకాని అయోమయం కలిగించేలా ప్రవర్తించేవారు. ఆన్ స్క్రీన్ లో ఎన్నో సినిమాల్లో కలిసి నటించినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఇలాంటి అనుబంధమే కొనసాగుతోంది. ఇద్దరూ పబ్లిక్ లో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటారు.. అంతలోనే మళ్ళీ ఇద్దరూ ఒకటే అనే రేంజిలో కౌగిలించుకొని కనిపిస్తారు. వారిద్దరి అనుబంధం ప్రేక్షకులకు కూడా సరదాగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య మోహన్ బాబు – చిరంజీవి తమ మధ్య ఉన్న కోల్డ్ వార్ కి స్వస్థి పలికి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఈ క్రమంలో సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వీరి అనుబంధం బయటపడింది.

కాగా నిన్న మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు సన్నిహితులు శ్రేయోభిలాషులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు ”చిరంజీవి నాకు మంచి మిత్రుడు. అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్” అని ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. అంతటితో సరిపెట్టకుండా చిరంజీవి పుట్టినరోజు కానుకగా కొయ్యతో చేసిన బుల్లెట్ ను పంపించారు మోహన్ బాబు. ఆ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ”నా చిరకాల మిత్రుడు తొలిసారిగా నా పుట్టిన రోజునాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… థాంక్యూ మోహన్ బాబు” అంటూ ట్వీట్ చేసి మోహన్ బాబు పంపిన గిఫ్ట్ తో దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ విధంగా మరోసారి వీరిద్దరూ ఒకరిపై ఒకరికున్న అభిమానాన్ని చాటుకున్నారు.