హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని సైడ్ చేసారా…?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఏదనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. పవన్ కెరీర్లో 27వ సినిమాని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. ఆ తర్వాత సినిమా ‘గబ్బర్ సింగ్’ హరీష్ శంకర్ తో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇలా పక్కా ప్లానింగ్ తో కెరీర్లోనే ఎప్పుడు లేనంత స్పీడ్ గా సినిమాలను లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ కి కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. అంతేకాకుండా తన సినిమాల లైనప్ ని తారుమారు చేసింది.

కాగా ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాని రామ్ తళ్లూరితో చేయాడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ని వెంటనే పట్టాలెక్కించాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఇక కరోనా పరిస్థితుల కారణంగా క్రిష్ తో చేసే సినిమాకి బడ్జెట్ ప్రాబ్లమ్స్ రావొచ్చని ఆలోచిస్తున్నారట. భారీ బడ్జెట్ తో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ ని ‘వకీల్ సాబ్’ రాబట్టే కలెక్షన్స్ బట్టి డిసైడ్ చేయాలని అనుకుంటున్నారట. అందుకే క్రిష్ ప్రస్తుతానికి ఈ మూవీని పక్కన పెట్టి వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా స్టార్ట్ చేసాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పై సందేహాలు ఏర్పడ్డాయని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లంతా సైలెంట్ గా ఉన్నా.. హరీష్ తన ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి హడావుడి చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు హరీష్ ఏకంగా పవన్ లైనప్ లో చివరన ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి పవన్ కళ్యాణ్ లైన్లో పెట్టిన సినిమాలలో మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తోంది హరీష్ సినిమా కోసమే. పవర్ స్టార్ కి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ మాస్ డైరెక్టర్ పవన్ ని ఓ రేంజ్ లో చూపిస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. హరీష్ ఏ ట్వీట్ చేసినా దాని కింద పవన్ అభిమానులు పెట్టే కామెంట్స్ చూస్తూనే వీరి కాంబో కోసం వారు ఎంతలా ఎదురు చూస్తున్నారనేది అర్థం అవుతుంది. కానీ ఇప్పుడేమో హరీష్ ప్రాజెక్ట్ కంటే ముందు వేరే సినిమాలు చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో పవన్ సినిమాల విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.