మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభం…!

0

విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న దేశభక్తి చిత్రం ”సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన టైటిల్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రాన్ని ఈ రోజు హైదరాబాద్ లోని మోహన్ బాబు నివాసంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీమతి విరానికా మంచు – ఐరా – అవ్రమ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. విద్యా నిర్వాణ – శ్రీమతి. మంచు లక్ష్మి ప్రసన్న క్లాప్ ఇచ్చారు. ముహూర్తం సన్నివేశానికి విష్ణు మంచు దర్శకత్వం వహించారు. అరియానా మంచు – వివియానా మంచు స్క్రిప్ట్ ను డైరెక్షన్ టీమ్ కి అందజేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. కాగా తెలుగులో ఇంతకముందు చూడని స్టోరీలైన్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మంచు మోహన్ బాబు ఇంతకు ముందెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రను ఇందులో పోషిస్తున్నారు.

‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి మాస్ట్రో ఇలయరాజా సంగీతం సమకూర్చనున్నారు. సర్వేష్ మురారి ఛాయాగ్రాహకుడుగా వ్యవహరించనున్నారు. డైమండ్ రత్నాబాబు – తోటపల్లి సైనాథ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి డాక్టర్ మోహన్ బాబు స్క్రీన్ ప్లే కూడా అందిస్తుండటం విశేషం. గతంలో ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మంచు మోహన్ బాబు మరోసారి ఈ చిత్రంతో దేశభక్తిని చాటిచెప్పబోతున్నారని తెలుస్తోంది.