సోనూసూద్ గారు మోనాల్ ను కాపాడండి సర్

0

ఈమద్య సాయం.. సహాయం.. అవసరం అనే పదాలు వినిపించిన వెంటనే సినిమా విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన సోనూసూద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన చేసిన సాయాల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. లాక్ డౌన్ ఆరంభం సమయంలో వలస కార్మికుల కోసం ఆయన చేసిన సాయం నుండి మొదలుకుని మొన్నటికి మొన్న విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వడం.. ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన ప్రకటన ఇలా అన్నింటితో ఆయన రియల్ హీరో అయ్యాడు. అందుకే సోనూసూద్ ను ప్రతి ఒక్కరు సాయం చేయమని కోరుతున్నారు. అలా తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మోనాల్ గజ్జర్ అభిమాని ఒకరు కూడా సోనూసూద్ ను సాయం అడిగాడు. అది తన కోసం కాదు.. తాను అభిమానించే మోనాల్ కోసం.

మోనాల్ గజ్జర్ ను బిగ్ బాస్ వారు మరియు బయట కొందరు దారుణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఇద్దరిని ప్రేమిస్తుందని ఇద్దరితో ఆమె డ్రామాలు ఆడుతూ ఇద్దరి ఆటను నాశనం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పగలంతా అఖిల్ తో రాత్రి అయితే అభిజిత్ తో మాట్లాడుతూ ఉంది అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అభిమాని మోనాల్ కు మద్దతు తెలుపుతూ అందులో సోనూసూద్ ను మోనాల్ కు సాయం చేయాల్సిందిగా కోరాడు.

ఆ లేఖలో.. డియర్ సోనూసూద్ సర్ మీకు మోనాల్ తెలిస్తే ఆమెకు దయచేసి సపోర్ట్ చేయండి. ఆమెను విజేతగా నిలిపేందుకు ఈ పని చేయడం లేదు. ఆమె గురించి బయట చాలా బ్యాడ్ ప్రచారం సాగుతుంది. ఆ విషయాలు ఆమెకు తెలిస్తే ఎంత బాధ పడుతుందో.. ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఆమె గుజరాతీ అవ్వడం వల్ల ఇక్కడి వారు ఆమె గురించి పూర్తిగా తప్పుడుగా మాట్లాడుతున్నారు. అఖిల్ మరియు అభిజిత్ లను ఆమె మంచి స్నేహితులుగా చూస్తుంది. కాని జనాలు మాత్రం ఆమెను మరోలా అర్థం చేసుకుంటున్నారు.

అఖిల్ కు రాత్రి సమయంలో త్వరగా పడుకునే అలవాటు ఉంటుంది. అఖిల్ పడుకున్న కారణంగా రాత్రి సమయంలో అభిజిత్ తో స్నేహంతో మాట్లాడుతుంది. అంతే తప్ప ఆమె తప్పేం లేదు. ఆమెకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల కూడా జనాలు ఆమెను అర్థం చేసుకోలేక అబద్దాలు చెబుతున్నారు అంటూ మాట వచ్చింది. అందుకే మీరు ఆమెకు మద్దతు ఇవ్వాలంటూ సోనూసూద్ ను మోనాల్ అభిమాని కోరాడు. అందరికి సాయం చేస్తున్న సోనూసూద్ ఈ లేఖ పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి.