మోసగాళ్లు టీజర్ టాక్

0

ఓవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి .. వియ్ విల్ ఫైండ్ యు.. వియ్ విల్ ఎలిమినేట్ యు .. ఐ యామ్ ప్రపేర్డ్ టేక్ యాక్షన్ వాటెవ్వర్ నెసెస్సరీ.. అంటూ నానా రుబాబ్ చేస్తున్నారు? ఇంతలోనే మంచు విష్ణు- కాజల్ జోడీ అలా ప్రత్యక్షమై డబ్బు సంచులు దాచిన డెన్ నుంచి బయటికి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. `ఇది సరిపోతుందా?` అంటూ కాజల్ ప్రశ్న.. దానికి సమాధానంగా.. `ఆట ఇప్పుడే మొదలైంది` అంటూ మంచు విష్ణు నర్మగర్భమైన వ్యాఖ్య.

చూస్తుంటే ఇదేదో మోసగాళ్ల ఆటలానే ఉంది. ఏంటా మోసం? అంటే ఇప్పటికే ఇదో వైట్ కాలర్ నేరానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా అని చిత్రబృందం వెల్లడించింది. `అమెరికాలో పెద్ద ఐటీ స్కామ్` నేపథ్యంలో సినిమా ఇదన్న ప్రచారం సాగుతోంది. బాగా సంచుల కొద్దీ డబ్బుకొట్టేసే మోసగాడి ఆట ఎలా ఉంటుందో చూడాలన్న కిక్కు జనాల్లో చాలానే ఉంది. అయితే దానిని చూపించే పద్ధతిలో చూపిస్తే బాగానే చూస్తారు. మరి ఆ విషయంలో విష్ణు గ్యాంగ్ ఏ మేరకు సఫలమైంది? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.

నేటి ఉదయం అల్లు అర్జున్ `మోసగాళ్లు` టీజర్ ను ఆవిష్కరించారు. ఐటీ కుంభకోణం రేంజెంతో రివీలైంది. భారత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియాను ఉద్దేశించి మాట్లాడినదేమిటి? అంటే.. భారతదేశంలో పుట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను కదిలించిన అతిపెద్ద ఐటి కుంభకోణానికి కారకులైన నేరస్థులను హెచ్చరించారుట. మీరెవరో కనిపెట్టి చర్యలు తీసుకుంటామన్నది ట్రంప్ హెచ్చరిక. తరువాతి ఎపిసోడ్ విష్ణు మంచు – కాజల్ అగర్వాల్ లను ఈ కుంభకోణం వెనుక సూత్రధారులు అని తేలింది. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ భాషల్లో విడుదల కానుంది. విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ విష్ణు సోదరిగా కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. రుహి సింగ్.. నవీన్ చంద్ర.. నవదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.