క్వీన్ అరెస్ట్ తప్పదా..?

0

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ని ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసులో మహారాష్ట్రలోని రాయగఢ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2018లో సెక్షన్ 306 ప్రకారం అర్నబ్ పై నమోదైన కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది నటి కంగనా రనౌత్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్ ఈ మధ్య నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా రనౌత్ బాలీవుడ్ పైన మరియు మహారాష్ట్రలో ఉన్న శివసేన ప్రభుత్వంపైనా అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. సుశాంత్ ది ఆత్మహత్య కాదని కంగనా చెప్పడంతో స్టార్ట్ అయి.. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కంగనా బంగ్లా కూల్చే వరకు వచ్చింది. ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చడంతో ప్రారంభమైన కంగనా – శివసేన మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో చాన్స్ దొరికినప్పుడల్లా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ తో పాటు ఆయన కుమారుడు ఆదిత్య థాకరే మరియు శివసేన నాయకులపైనా విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ అనే పేరు సార్ధకం చేసుకుంటోంది.

ఇదే క్రమంలో కంగనా మీద అనేక కేసులు నమోదు చేయబడ్డాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. రైతులను కించపరిచారని కంగనాపై కేసులు నమోదైనాయి. అలానే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని కంగనా మరియు ఆమె సోదరి రంగోళిపై ముంబైలో దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసుల విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ముంబై పోలీసులు రెండు సార్లు కంగనా మరియు ఆమె సోదరికి నోటీసులు జారీ చేశారు. అయినా సరే వారు విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కంగనా ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ సైతం ఆమెపై కేసు పెట్టారు. సుశాంత్ మృతి కేసు నేపథ్యంలో మహా ప్రభుత్వంపైనా బాలీవుడ్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చన వారిలో అర్ణబ్ గోస్వామి – కంగనా లను ప్రథమంగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ చిత్రనిర్మాతలు హైకోర్టులో బాధ్యతా రహితమైన రిపోర్టింగ్ చేస్తున్నారంటూ దావా వేసే స్థాయిలో అర్నబ్ వారిపై విరుచుకుపడ్డాడు. అలానే సుశాంత్ కేసుని స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముంబై పోలీసుల పై మహా ప్రభుత్వం పై వ్యతిరేఖ కథనాలు ప్రసారం చేశారు. దీంతో పాత కేసులో ఇప్పుడు అర్నబ్ ని అరెస్ట్ చేశారు.

అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదని వాదిస్తూ వచ్చిన కంగనా… ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే అభియోగాలను ఎదుర్కొంటున్న అర్నబ్ గోస్వామికి మద్ధతు ప్రకటించింది. ఓ వీడియోని షేర్ చేస్తూ ‘ఎంతో మంది దేశభక్తుల గొంతులు కోసారు. ఎంతో మందికి ఉరితాళ్లు బిగించారు. అయినా మేము వెనుకడుగు వేయం. ఒక గొంతు నొక్కితే చూస్తే ఎన్నో గొంతులు లేస్తాయి’ అంటూ ఫైచెప్పుకొచ్చింది కంగనా. అలానే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే మరియు ఆయన కుమారుడిపై కూడా కంగన విమర్శలు చేసింది. ‘నీ తండ్రి పప్పు లాంటి పాలన చేస్తే పప్పుసేన అని అంటాం. సోనియా సేన అంటే కోపం వస్తుందంటే మరోసారి మీరు సోనియా సేనకి చెందిన వారే అని అంటాను’ అని కంగన మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున్న కంగనా ముంబైలో అడుగుపెడితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు.