Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రభాస్ చేతుల మీదుగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ లుక్…!

ప్రభాస్ చేతుల మీదుగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ లుక్…!


‘వినాయకుడు’ ‘విలేజ్ లో వినాయకుడు’ వంటి చిత్రాలలో హీరోగా మెప్పించిన కృష్ణుడు ఇప్పుడు నిర్మాతగా మారారు. కృష్ణుడు తన కూతురు పేరు మీద ‘నిత్య క్రియేషన్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ”మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్” అనే సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. పోస్టర్ లో హీరో ఒక అమ్మాయి కళ్ళు మూసిపెట్టి మరో అమ్మాయిని కిస్ చేస్తున్నాడు. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. ‘గడ్డం గ్యాంగ్’ ‘మొట్ట శివ కెట్ట శివ’ వంటి చిత్రాలకు వర్క్ చేసిన జయరామ్ లోతుగడ్డ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ త్వరలోనే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఓటీటీలో విడుదల కానుందని సమాచారం.

కాగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ చిత్రం గురించి నిర్మాత కృష్ణుడు మాట్లాడుతూ.. ”నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. కొత్త కథ కథనాలతో సినిమా తెరకెక్కించాం. ఫైనల్ అవుట్ పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్ను ఆదరించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు వెల్లడిస్తా” అని చెప్పుకొచ్చారు.