ఆమె వివాదం నుండి నాగబాబు కాపాడారు : నవదీప్

0

నవదీప్ హీరోగా సక్సెస్ అవ్వలేక పోయినా కూడా ఆయన కెరీర్ ఆరంభం నుండి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే వచ్చాడు. హీరోగా నవదీప్ చేసిన పలు సినిమాలు వివాదాస్పదం అయ్యాయి. హీరోగా నవదీప్ చేసిన ఒక సినిమాలో అంకిత హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో నవదీప్ వల్ల అంకిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నవదీప్ చాలా మానసిక సంఘర్షణకు గురి అయ్యాడట. తాజాగా ఆ విషయాన్ని అలీతో సరదాగా టాక్ షో లో వెళ్లడించాడు.

ఆనాటి సంగతులను నవదీప్ వెళ్లడిస్తూ… నేను వరుసగా ప్లాప్ ల్లో ఉన్న సమయంలో అంకిత వరుస సక్సెస్ల్లో ఉన్న సమయంలో మా ఇద్దరి కాంబోలో సినిమాను అనుకున్నారు. మొదటి నుండే ఆమె నా సినిమాలో నటించేందుకు ఇష్టం చూపించలేదు. మద్యలో ఆమె కొన్నాళ్ల పాటు షూటింగ్ రాకుండా నిర్మాతలను ఇబ్బంది పెట్టింది. నిర్మాతలు ఆమెను అగ్రిమెంట్ ముందు పెట్టి షూటింగ్ పూర్తి చేయించారు. ఆ తర్వాత ఆమె నాపై నిర్మాతలకు ఫిర్యాదు చేయడం మొదలు పెట్టింది.

ఆ సమయంలో ఏదోలా సినిమాను పూర్తి చేశాం. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి హీరోయిన్ అంకిత మీ వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. దీనిపై మీరు ఏమంటారు అంటూ ప్రశ్నించడంతో షాక్ అయ్యాను. ఆ విషయమై నేను నా కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేశాము. ఆ సమయంలో నాకు నాగబాబు గారు సాయంగా నిలిచారు. ఆయన మద్దతుతో ఆ సమస్య నుండి బయట పడ్డాను. ప్రెస్ మీట్ పెట్టి ఆ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పాను. దాంతో నాకు ఆ వివాదంతో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.