Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన రష్మీ’ పై రియాక్ట్ అయిన యువ హీరో..!

‘భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన రష్మీ’ పై రియాక్ట్ అయిన యువ హీరో..!


గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నిత్యం లక్షల కొద్దీ వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. అయితే వాటిని వీక్షకులు ఓపెన్ చేయడానికి థంబ్ నెయిల్స్ తో అట్రాక్ట్ కలిగిస్తుంటారు. కొన్నిటికి వీడియోలో ఉన్న కంటెంట్ కి తగ్గట్టే థంబ్ నెయిల్స్ ఉంటాయి. అయితే మరికొన్నిటికి మాత్రం థంబ్ నెయిల్స్ కి మ్యాటర్ కి సంబంధం ఉండదు. అలాంటి వీడియోస్ లో ఎక్కువగా సెలబ్రిటీస్ కి సంబంధించిన కల్పిత వార్తలు ఉంటాయి. సెలబ్రిటీస్ లో ఎక్కువ మంది ఇలాంటివి ఫాలో అవ్వరు.. అయినా అలాంటి న్యూస్ పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం అప్పుడప్పుడు రియాక్ట్ అవుతుంటారు. ఇప్పుడా లేటెస్టుగా టాలీవుడ్ లో హీరోగా సహాయ నటుడిగా రాణిస్తున్న నందు విజయ కృష్ణ ఓ థంబ్ నెయిల్ పై స్పందించాడు.

నందు ఎప్పుడు కూడా నెటిజన్స్ ట్రోల్స్ మీమ్స్ ను లైట్ తీసుకుంటాడు. అతని గత చిత్రాలపై క్రియేటివ్ ట్రోల్స్ చేసిన వారికి బహుమతులు ట్రీట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్టుగా నందు నటిస్తున్న ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాకి ఎవరైతే క్రియేటివ్గా మీమ్స్ చేస్తారో వారికి పదివేలు క్యాష్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించాడు. అయితే అలాంటి నందు ఓ యూట్యూబ్ థంబ్ నెయిల్ పై రియాక్ట్ అయ్యాడు. ‘భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన రష్మీ’ అనే యూట్యూబ్ హెడ్డింగ్ పై నందు స్పందిస్తూ సెటైర్ వేశాడు. ఆ వీడియో థంబ్ నెయిల్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో నందు పోస్ట్ చేస్తూ.. ”మీ బొంద రా మీ బొంద ఇది చూసావా గీతా? ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం మనం గొడవ పడాలి అనుకుంటా’ అని ఫన్నీ కామెంట్ పెట్టి భార్య గీతా మాధురిని ట్యాగ్ చేశాడు. దీనికి గీతా మాధురి ”చూసా బుజ్జి. కరోనాకి అయినా వాక్సిన్ వస్తుందేమో కానీ ఈ థంబ్ నెయిల్ ఫెలోస్ మాత్రం చేంజ్ అవ్వరు” అని కామెంట్ చేసారు. రష్మీ కూడా ఆ థంబ్ నెయిల్ ని ఉద్దేశించి ”ఏంటో వీళ్ళ బాధ” అని కామెంట్ చేసారు.

అయితే ఇప్పుడు నందు – గీతా మధ్యలో రష్మీని లాగడానికి కారణం వీరిద్దరూ కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాలో నటిస్తుండటమే. రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల – బోసుబాబు నిడుమోలు – ఆనంద్ రెడ్డి – మనోహర్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాలో నందు ‘పోతురాజు’ అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి వీరాభిమానిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి విశేష స్పందన లభించింది. ఈ బొమ్మతో నందు బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అనిపిస్తోంది.