బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసును ప్రభుత్వాలు సీబీఐకి అప్పగించి మరీ విచారణ జరిపించడం అభినందించాల్సిన విషయమే. కాని ఇంతకు ముందు ఇలా ఎందుకు చేయలేదు. ఆ సమయంలో చనిపోయిన వారి గురించి ప్రభుత్వాలకు ఎందుకు పట్టలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సుశాంత్ కేసులో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాగే అంతకు ముందు చనిపోయిన వారి కేసుల్లో సంచలన విషయాలు బయటకు వచ్చేవి అనేది చాలా మంది మాట.
తాజాగా ఈ విషయమై లేడీ అమితాబ్ విజయశాంతి కూడా స్పందించారు. ఆమె సుశాంత్ కేసు విషయంలో సీబీఐ విచారణ మంచిదే. అయితే ఇంతకు ముందు ఎంతో మంది హీరోయిన్స్ అత్యంత దారుణంగా మృతి చెందారు. తెలంగాణలో కూడా అలాంటి కేసులు జరిగాయి. అప్పుడు ఎందుకు ఇలాంటి విచారణ జరగలేదు. విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చేవి కదా అంటూ ప్రశ్నించింది. విజయశాంతి ఫేస్ బుక్ లో సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. అందులో ఆమె ఇండస్ట్రీలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలను చెప్పుకొచ్చారు.
విజయశాంతి ఫేస్ బుక్ పోస్ట్.. బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ… మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు… దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ… సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా… వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
