Templates by BIGtheme NET
Home >> Cinema News >> స్టార్ హీరో క్రేజీ మూవీ ఊసే లేదుగా..!

స్టార్ హీరో క్రేజీ మూవీ ఊసే లేదుగా..!


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘తుపాకి’ ‘సర్కార్’ ‘పోలీసోడు’ ‘విజిల్’ ‘అదిరింది’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎప్పటి నుంచో టాలీవుడ్ మార్కెట్ పై పాగా వేయాలని చూస్తున్న విజయ్.. ”మాస్టర్” సినిమాతో ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకున్నాడు. విజయ్ కథానాయకుడిగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన ‘మాస్టర్’ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ సినిమా తెలుగులో కూడా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దీంతో ‘మాస్టర్’ సినిమాపై టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే కరోనా వచ్చి ఈ సినిమాపై.. విజయ్ ఆశలపై పెద్ద దెబ్బ వేసింది.

లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్న ‘మాస్టర్’ చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత దీపావళికి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే నవంబర్ 10 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చినా ‘మాస్టర్’ మేకర్స్ మాత్రం సైలెంటుగా ఉంటున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది. అయితే లాక్ డౌన్ కి ముందు హడావిడి చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సైలెంట్ అయిపోవడం విజయ్ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అటు తమిళంలో ఇటు తెలుగులో ‘మాస్టర్’ ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

కాకపోతే తమిళంలో ఓ చిన్న అప్డేట్ ఇస్తే మళ్లీ తమిళ తంభీలు అంతా విజయ్ ‘మాస్టర్’ మేనియాలో పడిపోతారని చెప్పవచ్చు. కానీ డబ్బింగ్ చిత్రానికి తెలుగులో బజ్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్న టీమ్ కూడా ఈ ప్రాజెక్ట్ ని లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తోందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వస్తున్నాయి. ‘ఇళయ దళపతి’ విజయ్ తన కెరీర్లో 64వ చిత్రంగా వస్తున్న ‘మాస్టర్’ ని వచ్చే ఏడాది పొంగల్ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మాళవికా మోహనన్ హీరోయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎక్స్.బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఆంటోనీ – శాంతను కీలక పాత్రలు పోషించారు.