భీమ్ టీజర్.. తారక్ ఫ్యాన్స్ ఫీలింగేంటి?

0

నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కొమరం భీమ్ టీజర్ వచ్చేసింది. మే 20న తారక్ పుట్టిన రోజు నాడే రావాల్సిన టీజర్ ఇది. కానీ కరోనా కారణంగా టీజర్కు అవసరమైన విజువల్స్ తీసుకునే అవకాశం లేకపోవడంతో చిత్ర బృందం ఏమీ చేయలేకపోయింది. ఈ నెల ఆరంభంలో తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొదలుపెట్టిన జక్కన్న.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీజర్ విజువల్స్ షూట్ చేసేశాడు. వెంటనే టీజర్ పని మొదలైపోయింది. గురువారం కొమరం భీమ్ జయంతిని పురస్కరించుకుని ఈ టీజర్ను విడుదల చేయడం విశేషం. ఇక ఈ టీజర్ కోసం ఎంతో ఉత్సాహంతో భారీ అంచనాలతో ఎదురు చూస్తూ వచ్చిన తారక్ అభిమానులు.. టీజర్ చూశాక ఎలా స్పందిస్తున్నారన్నది ఆసక్తికరం. వాళ్లే పెట్టుకున్న అంచనాల స్థాయిలో టీజర్ లేదన్న కామెంట్లు ట్విట్టర్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మామూలుగా చూస్తే భీమ్ టీజర్ బాగుంది కానీ.. సీతారామరాజు టీజర్తో పోలిస్తే కొంచెం దీని రేంజ్ తగ్గిందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. రామరాజు పాత్రను ఎలివేట్ చేసిన స్థాయిలో దీన్ని ఎలివేట్ చేయట్లేదని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. రామరాజు టీజర్కు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఎస్సెట్ అయిందో.. అంతకుమించి తారక్ వాయిస్ ఓవర్ ప్లస్ అయింది. భీమ్ టీజర్లో చరణ్ వాయిస్ ఇంకా బాగుండాల్సిందని తారక్ లాగా టీజర్ను ఎలివేట్ చేయలేకపోయాడని వాళ్లు విమర్శిస్తున్నారు. ట్విట్టర్లో ఎక్కువగా ఇలాంటి కామెంట్లే కనిపిస్తున్నాయి. వాళ్లను కౌంటర్ చేస్తూ చరణ్ ఫ్యాన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు. తారక్ ఫ్యాన్స్లో రాజమౌళిని తిడుతున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఐతే భారీ అంచనాలతో చూడటం వల్ల ఇనీషియల్ రియాక్షన్ ఇలా ఉన్నప్పటికీ.. తర్వాత తారక్ అభిమానుల అభిప్రాయం మారే అవకాశం లేకపోలేదు.