ఆర్ఆర్ఆర్ ‘భీం’ టీజర్ పై సీతక్క సర్ ప్రైజ్ ట్వీట్

0

ఆదిలాబాద్ అడవి బిడ్డ గోండుల గండ్రబెబ్బులి స్వాతంత్ర్య సమరయోధుడు అయిన కొమురం భీం వీరత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజంలో భీం చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక భావితరాలకు కూడా కొమురం భీం చరిత్ర తెలిసేలా దర్శక ధీరుడు రాజమౌళి నడుం బిగించారు. తాజాగా ఆయన తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో కొమురం భీం అజ్ఞాత వాసిన్ని ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు టాక్ ఉంది. నిజాంలను ఎదురించి వెళ్లిపోయిన కొమురం భీం కొన్నేళ్లు ఎక్కడ గడిపాడన్నది ఇప్పటికీ మిస్టరీ. ఆ మిస్టరీనే రాజమౌళి చూపించబోతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే ఈరోజు ఆర్ఆర్ఆర్ నుంచి ‘రామరాజు ఫర్ భీం’ పేరుతో ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేస్తూ కొమురం భీం టీజర్ రిలీజ్ అయ్యింది. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు టీజర్ కు సరితూగేలా దీన్ని రాజమౌళి రూపొందించారు. తాజాగా కొమురం భీం 119వ జయంతి వారోత్సవాల సందర్భంగా ఈ టీజర్ ను రాజమౌళి రిలీజ్ చేశాడు. రాంచరణ్ వాయిస్ ఇచ్చిన ఈ టీజర్ లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. అతడి పరాక్రమానికి టీజర్ చూసిన జనాలు విజిల్స్ వేయకుండా ఉండలేకపోతున్నారు.

అభిమానులే కాదు.. ఇప్పుడు ప్రజాప్రతినిధుల నుంచి కూడా ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ కు ప్రశంసలు దక్కాయి. తెలంగాణ ఫైర్ బ్రాండ్ అదే అడవి బిడ్డ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ పై స్పందించడం విశేషం.. అనూహ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ టీజర్ ను షేర్ చేసి టీంకు విషెస్ చెప్పారు.

‘మన్యం ముద్దుబిడ్డ. మా అన్న మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. రాజమౌళి రాంచరణ్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశారు. ఇలా ఓ ప్రజా ప్రతినిధి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని ఫైర్ బ్రాండ్ నుంచి ఆర్ఆర్ఆర్ టీంకు ఈ ప్రశంసలు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు.