అమెరికా కోడలు పీసీకి ఆస్కార్ అవార్డ్ గ్యారెంటీ!

0

ముంబై టు అమెరికా పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా అజేయమైన ప్రయాణం తెలిసిందే. బాలీవుడ్ టు హాలీవుడ్ కలలతో ఈ అమ్మడు అసాధారణ సాహసాలే చేస్తోంది. అంతేకాదు.. అటు పాశ్చాత్య దేశాల్లో వెబ్ సిరీస్ లు సినిమాల నిర్మాణం ప్రణాళికతో ఏ ఇతర నాయికా తనను టచ్ చేయలేని రేంజుకు ఎదిగిపోతోంది.

ప్రేమించిన అమెరికన్ పాప్ గాయకుడు కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడడం తనకు అన్నిరకాలుగా కలిసొస్తోంది. ఇప్పుడు పీసీకి మరో ముందడుగు వేసే సమయం ఆసన్నమైందని అంచనా వేస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ స్టోరి ప్రకారం.. వచ్చే ఏడాది ప్రారంభంలో 93 వ అకాడమీ అవార్డులలో ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకునే హాట్ ఫేవరెట్స్ జాబితాలో ప్రియాంక చోప్రా ఒకరిగా ఉంటారని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం `ది వైట్ టైగర్` ఈసారి ఆస్కార్ రేసులో ఉంటుంది. ఇందులో పీసీ నటన విమర్శకులను జ్యూరీ సభ్యులను ఆకట్టుకోవడం ఖాయం అన్న చర్చా మొదలైంది.

`వైట్ టైగర్` మూవీ నేపథ్యం ఆసక్తికరం. ప్రఖ్యాత భారతీయ రచయిత అరవింద్ అడిగా ప్రశంసలు పొందిన పుస్తకం ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో అవార్డు రేంజ్ పెర్ఫామర్ రాజ్ కుమార్ రావు ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ ఫిలిం మేకర్ రామిన్ బహ్రానీ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఇది నేరుగా OTT ప్లాట్ఫాంపై విడుదల కానుంది.

పీసీతో పోటీబరిలో చాలామంది టాప్ స్టార్లు ఉన్నారు. మెరిల్ స్ట్రీప్ (ది ప్రోమ్ కోసం) హాన్ యెన్-రి (మినారి కోసం)… క్రిస్టిన్ స్కాట్ థామస్ (రెబెక్కా కోసం) .. ఒలివియా కోల్మన్ (ది ఫాదర్ కోసం) వంటి టాప్ స్టార్లు పోటీదారులలో ఉన్నారు. వీళ్లందరిలోనూ ఉత్తమ సహాయ నటిగా అమెరికా కోడలు ప్రియాంక చోప్రా హాట్ ఫేవరెట్ గా కొనసాగనుందిట.