పవన్ ప్రకాష్ రాజ్ కలవబోతున్నారు

0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నపుడు ఇంటర్వ్యూయర్ పవన్ ప్రస్తావన తీసుకురాగా.. జనసేనాని ఎక్కడ తప్పు చేస్తున్నాడో కొంత వరకు సానుకూల ధోరణిలోనే వివరించే ప్రయత్నం చేశాడు ప్రకాష్ రాజ్. తర్వాత ఆయన మాట అదుపు తప్పింది. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడంటూ పవన్ను విమర్శించి జనసేన మద్దతుదారుల ఆగ్రహానికి గురయ్యాడు. దీనిపై పవన్ అన్నయ్య నాగబాబు తీవ్రంగా స్పందించాడు. ఐతే పవన్ మాత్రం ఇప్పటిదాకా ఆ వ్యాఖ్యలపై స్పందించలేదు. తర్వాత కూడా దీని గురించి మాట్లాడతాడా అన్నది సందేహమే.

ఐతే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ బహిరంగంగా మాట్లాడ్డం సంగతలా ఉంచితే.. ప్రకాష్ రాజ్ నేరుగా ఎదురుపడితే ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరం. వీళ్లిద్దరూ త్వరలోనే కలవబోతున్న నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. కరోనా విరామం తర్వాత ఈ మధ్యే పవన్ మళ్లీ వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని త్వరలోనే మళ్లీ కొత్త షెడ్యూల్కు హాజరు కానున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్ కూడా ఆ షెడ్యూల్లో పాల్గొంటాడట. ఇందులో పవన్.. బడా బాబుల చేతిలో అన్యాయానికి గురైన అమ్మాయిల పక్షాల వాదించే లాయర్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అటువైపు విలన్లకు మద్దతుగా నిలిచే లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు. వీళ్లిద్దరిపై తర్వాతి షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. మరి పవన్పై ప్రకాష్ రాజ్ తాజా విమర్శలపై పెద్ద చర్చ జరిగిన నేపథ్యంలో వీళ్లిద్దరూ షూటింగ్ కోసం ఎదురు పడినపుడు పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇద్దరూ ముందులా స్నేహంగా ఉంటారా.. రాజకీయాలు విమర్శల చర్చ వస్తుందా అన్నది ఆసక్తికరం.