పవన్ క్యూ పెంచుతూనే ఉన్నాడు

0

అజ్ఞాతవాసి సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ తో రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఇప్పటికే రావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. వకీల్ సాబ్ కాకుండా ఇప్పటికే పవన్ ఓకే చెప్పగా అధికారికంగా ప్రకటన వచ్చిన సినిమాలు రెండు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో మూవీ మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలకు కూడా పవన్ ఓకే చెప్పారని తెలుస్తోంది.

మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ ను పవన్ చేసేందుకు ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ కథ అందించబోతున్నాడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తాడంటూ కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కూడా దాదాపుగా ఫైనల్ అయినట్లే అంటున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత హీరో కోసం అన్వేషిస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఇటీవలే పవన్ కళ్యాణ్ తో ఒక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నట్లుగా తెలుస్తోంది.

వక్కంతం వంశీ మరియు సురెందర్ రెడ్డిలు తయారు చేసిన కథ పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చిందట. ఆ ప్రాజెక్ట్ ను పవన్ మిత్రుడు అయిన రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నాడు. ఈ విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. కిక్ వంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ ను పవన్ తో చేసేందుకు సురేందర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. క్రిష్ మరియు హరీష్ శంకర్ ల సినిమాలు పట్టాలెక్కాల్సి ఉన్నాయి. ఇన్ని క్యూలో ఉండగా సూరిని కూడా పవన్ క్యూలో పెట్టాడు. మొత్తానికి పవన్ తన క్యూను పెంచుతూనే ఉన్నాడు.