అంతు చూస్తా చంపేస్తానని డైరెక్టర్ బెదిరింపులు

0

మీటూ వేదికగా దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కశ్యప్ పై పోలీస్ కేసు నమోదైంది. అయితే ఈ కేసు మరింత ముదిరిపాకాన పడుతోంది.

తాజాగా పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేశారు. దర్శకుడు అనురాగ్ తనని చంపేస్తానని అంతు చూస్తానని బెదిరించాడని తన ప్రాణాలకు హాని ఉందని ఆరోపించడం సంచలనమైంది. బయటకు రావాలంటేనే భయపడుతున్నా. అనురాగ్ ఆయన వర్గం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ క్షణంలో అయినా దాడి జరుగుతుందనే భయంగా ఉంది! అంటూ ఘోష్ ఆరోపించింది.

ఇక పోలీసుల వైఖరిపై పాయల్ లాయర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఫిర్యాదు దారీనే పదే పదే పిలుస్తున్నారు కానీ అనురాగ్ ని ఎందుకని పిలవడం లేదు? అంటూ ప్రశ్నించారు. నా క్లయింట్ను మాత్రం ప్రతీ రోజు విచారణ పేరుతో పిలుస్తున్నారు. బాధితురాలిని విచారించడం ఎక్కడైనా ఉంటుందా? స్థలం గుర్తింపు కోసం తనను రేప్ చేసిన ప్రదేశానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల పేరుతో 6-7 గంటలు కూచోబెడుతున్నారు. వైద్య పరీక్షల పేరుతో వేధిస్తున్నారు.

తొలి రోజు ఓషియారా పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయగా.. ఆ తర్వాత ఆ కేసును వెర్సోవా పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడం వేధింపుల్లో భాగమేనని పాయల్ ఘోష్ లాయర్ ఆరోపించారు. అసలు పోలీసుల తీరు ఏమీ బాగాలేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.