కంగనకు తొలి పంచ్ ఇదిగో ఇలా పడింది

0

క్వీన్ కంగన రనౌత్ ఎటాకింగ్ నేచుర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తనతో పని చేసిన దర్శకరచయితలు.. నిర్మాతలతోనూ పలుమార్లు గొడవపడిన సంగతి చిలువలు పలువులుగా ప్రచారమైంది. కంగన తలబిరుసుకు బెదిరిపోయి చాలామంది తనని దూరం పెట్టేయడంపై ఆసక్తికర చర్చ సాగింది. అదొక్కటే కాదు.. హృతిక్ రోషన్ .. మహేష్ భట్ .. కరణ్ జోహార్ సహా ఎందరో ప్రముఖులపై నిరంతరం కారాలు మిరియాలు నూరుతుంది కంగన. తన ధీరత్వాన్ని మెచ్చేవాళ్లు ఎందరు ఉన్నారో తనతో పెట్టుకోకూడదు అనుకునేవాళ్లు అంతే ఉన్నారు.

ఇప్పుడు ఏకంగా తాను బాలీవుడ్ మాఫియా అంటూ కొందరు స్టార్ హీరోల పేర్లను బయటపెట్టడం అలానే డ్రగ్స్ లో వీళ్లంతా ఉన్నారని వాదించడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇకపై కంగనకు అన్ని వైపుల నుంచి డోర్స్ క్లోజ్ అయినట్టేనన్న చర్చా సాగుతోంది. ఆసక్తికరంగా కంగన రెబలిజానికి బయపడి చాలామంది ఇప్పటికే ఆఫర్లు ఇవ్వకపోవడంతో తనే నిర్మాత అవతారం ఎత్తి సొంత సినిమాలు తీస్తోంది. స్టార్ హీరోల్ని సైతం దూరం పెట్టేస్తోంది.

ఇదంతా ఇలా ఉంటే కంగనను ఓ క్రేజీ ప్రాజెక్టు నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కం దర్శకుడు పీసీ శ్రీరామ్ ఇటీవలే కంగన ప్రధాన పాత్రలో నటించే ఓ సినిమాకి పని చేసేందుకు అంగీకరించారు. కానీ ఇంతలోనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ ప్రకటించడం వేడెక్కిస్తోంది. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఎంత సౌమ్యుడు అన్న సంగతి తెలిసిందే. కంగన లాంటి వివాదాల క్వీన్ తో పని చేయడం కష్టమని భావించి ఇలా చేశారా? అంటూ చర్చ సాగుతోంది. ఆలోచిస్తే తనకు అసౌకర్యంగా అనిపించింది. అందుకే వద్దనుకున్నాను అని తెలిపారాయన. కంగన పైలెట్ గా నటించనున్న ఈ మూవీ టైటిల్ `తేజస్`గా ప్రచారమైంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సినిమాటోగ్రఫీ లెజెండ్ పీసీ శ్రీరామ్ తప్పుకోవడం హీట్ పెంచే వ్యవహారమే. ఇదే తీరుగా ఇతర ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తితే కంగనకు ఇబ్బందికర సన్నివేశమే అది.