స్టార్ డైరెక్టర్లను పక్కన పెడుతున్న పాన్ ఇండియా స్టార్…?

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ ‘పాన్ ఇండియా స్టార్’గా మారిపోయారు. ఆ ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముందుగా ‘సాహో’ మూవీని రిలీజ్ చేశాడు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబట్టింది. ‘సాహో’ సెట్స్ మీద ఉండగానే ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు ప్రభాస్. ఈ క్రమంలో తన కెరీర్లో 21వ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు లేటెస్టుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ అనే ద్విభాషా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.

కాగా టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రస్తుతం ప్రభాస్ ఒక్కడే ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నాడు. అయితే ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ మీడియం రేంజ్ డైరెక్టర్స్ తో చేస్తున్నవే అని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్రభాస్.. స్టార్ డైరెక్టర్లతో కాకుండా మీడియం రేంజ్ దర్శకులతో వెళ్తున్నాడు. ‘రన్ రాజా రన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ చేతిలో ‘సాహో’ అనే భారీ ప్రాజెక్ట్ పెట్టాడు. అలానే ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాధా కృష్ణ కుమార్ తో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ వంటి రెండు సినిమాలు తీసిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. ఇక బాలీవుడ్ ఎంట్రీకి ఎంచుకున్న డైరెక్టర్ ఓమ్ రౌత్ కూడా ఇంతకముందు మరాఠీలో ఓ సినిమా.. హిందీలో ‘తానాజీ’ అనే రెండు సినిమాలు మాత్రమే తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ నిలబెట్టుకోవడానికి మీడియం రేంజ్ డైరెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ప్రభాస్ మాత్రం డైరెక్టర్ అనుభవాన్ని కాకుండా టాలెంట్ ని.. స్టోరీని నమ్మి వారితో సినిమాలు కమిట్ అవుతున్నాడని తెలుస్తోంది.