‘రాధే శ్యామ్’ న్యూ పోస్టర్ కూడా కాపీయేనా…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఇటీవలే ఇటలీలో తిరిగి ప్రారంభమైంది. అక్టోబర్ 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఆ పోస్టర్ కాపీ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పోస్టర్ లో రైలు బండి నుంచి దట్టమైన పొగ బయటికొస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. పీరియాడికల్ మూవీకి తగ్గట్టే ఈ పోస్టర్ ఉందంటూ అభిమానులు అందరూ మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పోస్టర్ కు సంబంధించి ఒరిజినల్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టర్ కి ఈ పోస్టర్ కి కేవలం కలర్ లోనే డిఫరెన్స్ కనిపిస్తోంది. రెండిటినీ పక్క పక్కన పెట్టి ‘రాధే శ్యామ్’ పోస్టర్ కాపీ అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇంతకముందు ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై అదే స్థాయిలో ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ – ప్రజ్ఞా జైస్వాల్ ‘కంచె’ పోస్టర్.. విక్రమ్ – అమీ జాక్షన్ ‘ఐ’… బెల్లకొండ శ్రీనివాస్ – పూజాహెగ్డే ‘సాక్ష్యం’.. రణవీర్ సింగ్ – దీపికా పడుకొనే ‘రామ్ లీల’ సినిమా పోస్టర్లతో ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ ని పోల్చుతూ నెటిజన్స్ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేశారు. ఏదేమైనా ఇంటర్నెట్ – సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఫిలిం మేకర్స్ ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.