50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు : రాజమౌళి

0

కరోనా కారణంగా గత ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా సగం సీట్లతో థియేటర్స్ కి అనుమతినిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకోవచ్చని.. కాకపోతే థియేటర్స్ లో కోవిడ్ రూల్స్ పాటిస్తూ 50 శాతం సీటింగ్ కెపాసిటీని మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. అయితే దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది వర్కౌట్ అవుతుందో లేదో తనకు తెలియడం లేదని.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నానని పేర్కొన్నాడు.

రాజమౌళి మాట్లాడుతూ.. ”50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఫ్లైట్స్ లో రెండు మూడు గంటలు ప్రయాణిస్తున్నారు. దానితో పోల్చితే థియేటర్స్ లో సీట్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది. మరి అలాంటప్పుడు యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమోనని అనుకుంటున్నాను. అయితే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అనుకోని.. ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసకోవడానికి ఈ ప్రయత్నం చేసుండొచ్చు” అని చెప్పుకొచ్చాడు. ”అన్నీ ఇండస్ట్రీలను ఓపెన్ చేసినట్లు సినీ ఇండస్ట్రీని ఓపెన్ చేస్తే సమస్య ఏమీ ఉండదు. సినిమా ఇండస్ట్రీని ప్రత్యేకంగా చూడటం వల్ల థియేటర్ కు వెళితే ఆడిషనల్ డేంజరా అనే ఆలోచన జనాలకు కలుగుతుంది. ఎక్కడపడితే అక్కడ మాస్కులు ధరించకుండా తిరిగినప్పుడు లేని ప్రమాదం సినిమా థియేటర్ కు వెళ్లినప్పుడు వస్తుందని అనుకోవడం లేదు. ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చలేం. ఇతర దేశాల్లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇండియాలో ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్న కార్యక్రమాల్లో సినిమా అనేది ముఖ్యం” అని రాజమౌళి తెలిపారు. మరోవైపు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా ‘ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా థియేటర్స్ కు రావడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవచ్చని.. కనీసం సంగం సీట్లు నిండినా సంతోషమే’ అని పేర్కొన్నారు.