నాకిది పునర్జన్మ.. అభిమానుల ఆశీస్సులతో బతికా! హీరో రాజశేఖర్

0

ప్రముఖ హీరో రాజశేఖర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే రాజశేఖర్కు పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని వార్తలు వచ్చాయి. పలువురు నటీనటులు కూడా ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. రాజశేఖర్ కు చాలా రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించారు. ఆయనకు ఊపిరి అందకపోవడంతో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారు. ఆ సమయంలో రాజశేఖర్ కూతురు శివాత్మిక పెట్టిన ట్వీట్ వైరల్ అయ్యింది.

తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని.. ఆయన క్షేమంగా తిరిగి వచ్చేలా పూజలు చేయాలని ఆమె ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్తో రాజశేఖర్ ఫ్యాన్స్ ప్రేక్షకులు మరింత ఆందోళన చెందారు. అయితే చివరకు రాజశేఖర్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన తన ఆరోగ్యపరిస్థితి గురించి మీడియాతో పంచుకున్నారు.

‘కరోనాతో నేను మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పడ్డా. ఓ దశలో బతుకుతానన్న ఆశ కూడా సన్నగిల్లింది. నా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. కరోనా వచ్చాక దాదాపు 10 కిలోల బరువు కోల్పోయా. నేను ఆస్పత్రిలో నరకం అనుభవించా. నా ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందని వైద్యులు చెప్ప లేదు. కుటుంబసభ్యులు కూడా చెప్పలేదు.

నా అభిమానులు బంధువులు శ్రేయోభిలాషుల దీవెనలతోనే నేను ఆరోగ్యంగా ఇంటికి వచ్చా. నేను అజాగ్రత్తగా ఉండటం వల్లే కరోనా సోకింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటా. ప్రతి ఒక్కరూ మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. డబ్ల్యూహెచ్వో సూచనలు పాటించాలి. ‘నాకు కరోనా రాదు’ అనే ధోరణి సరికాదు. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నా. బహుశా వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్లో పాల్గొంటాను. కరోనా రావడం నాకు గొప్ప పాఠం నేర్పింది. ఇక నుంచి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటా’ అని రాజశేఖర్ తన అనుభవాలను పంచుకున్నారు.