రాజమౌళికి ఇది హెచ్చరిక!

0

మామూలుగా వరుసగా కొన్ని హిట్లు కొట్టాక ఆ తర్వాతి సినిమాల విషయంలో అంచనాల ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది దర్శకులు చిత్తయిపోతుంటారు. కానీ రాజమౌళి మాత్రం అందుకు మినహాయింపు. అంచనాలు పెరగడం వల్ల సినిమా రేంజ్ పెరుగుతుంది మంచి బిజినెస్ జరుగుతుంది అది మంచిదే కదా అంటాడు జక్కన్న. ప్రేక్షకులు ఎంత అంచనాలు పెట్టుకున్నా వాటిని రీచ్ కావడం కొన్నిసార్లు వాటిని మించిపోయే ఔట్ పుట్ ఇవ్వడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. కాబట్టే ఇప్పటిదాకా అపజయం అన్నదే లేకుండా సాగిపోతున్నాడు. సినిమా సినిమాకూ తన రేంజ్ ఇంకా ఇంకా పెంచుకుంటున్నాడు. ‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగా తనపై నెలకొన్న భారీ అంచనాలను కూడా ‘ఆర్ఆర్ఆర్’తో అందుకుంటాడనే అంతా అనుకున్నారు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన సీతారామరాజు టీజర్ చూశాక జక్కన్న మీద పూర్తి భరోసా పెట్టేశారు ప్రేక్షకులు. నిజానికి ఆ టీజర్ మీద ఎలాంటి అంచనాలతో లేరు ప్రేక్షకులు. అప్పుడసలు టీజర్ వస్తుందన్న సంకేతాలే కొన్ని రోజుల ముందు వరకు లేవు. ఉన్నట్లుండి రామరాజు టీజర్ వదిలారు. అందులో విజువల్స్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తారక్ వాయిస్ ఓవర్ కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ టాప్ నాచ్ అనిపించాయి. దీంతో ఆ తర్వాత ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ విషయంలో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. చిత్ర బృందం కూడా కొన్ని రోజులుగా కౌంట్ డౌన్ నిర్వహిస్తూ ఊరించే అప్ డేట్స్ ఇస్తూ అంచనాలు పెంచింది. ఇలా భారీ అంచనాలతో చూసిన వాళ్లకు భీమ్ టీజర్ ఆనట్లేదు.

ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ అతడి అభిమానులు ఆశించింది ఇంకా ఎక్కువ. చరణ్ వాయిస్ ఓవర్ తారక్తో పోలిస్తే జస్ట్ ఓకే అనిపించింది తప్ప వావ్ అనిపించలేదు. ఇక అన్నింటికీ మించి ఈ టీజర్తో వచ్చిన సమస్య.. రామరాజు టీజర్ను అనుకరిస్తూ సాగడం. హీరో బాడీ చూపించి ఎలివేషన్ కోసం ప్రయత్నించడం డైలాగ్స్ కూడా అదే తరహాలో రాయడంతో ఇక్కడ ఇంపాక్ట్ తగ్గింది. తొలి టీజర్తో పోలికే దీనికి సమస్యగా మారింది. మొత్తంగా చూస్తే ఎంతైనా అంచనాలు పెట్టుకోండి అందుకుంటా అన్నట్లు సాగిపోయే జక్కన్నకు ఈ మిశ్రమ స్పందన ఊహించనిదే. దీన్ని ఒక హెచ్చరికలా భావించి ‘ఆర్ఆర్ఆర్’ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దే ప్రయత్నం ఆయన చేయాలి.