ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ‘రామరాజు ఫర్ భీమ్’…!!

0

‘ఆర్.ఆర్.ఆర్’ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ గా ఇండియన్ బాక్సాఫీస్ కు తన సత్తా చూపించబోతున్నాడనే దానికి సాక్ష్యంగా తాజాగా స్పెషల్ టీజర్ ని విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పినట్లుగానే ‘భీమ్ ఫర్ రామరాజు’ కి రిటర్న్ గిఫ్ట్ గా ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ తారక్ కి అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చాడు. ”వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి దైర్యం చీకట్లని చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్” అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేశాడు.

చరణ్ ని నిప్పుల్లో చూపించిన రాజమౌళి ఈ ఇంట్రో వీడియోలో ఎన్టీఆర్ ని నీళ్లలో చూపించాడు. ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలలో అత్యంత శక్తివంతమైనవిగా చెప్పుకునే నిప్పు మరియు నీరు లను ‘అల్లూరి’ – ‘కొమరం భీమ్’ లకు అన్వయిస్తూ రాజమౌళి ప్రెజెంట్ చేసిన విధానాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. భీమ్ గా తారక్ ను చూపించే ప్రతి ఫ్రేమ్ లో నీటికి ప్రతీకగా ఉండే షాట్స్ ఎక్కువగా కనిపించాయి. దీనికి సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ అద్భుతమైన విజువల్స్ కి కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేసింది. దీనికి చరణ్ అందించిన వాయిస్ ఓవర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచాడని ఈ ఇంట్రో వీడియోతోనే తెలిసిపోతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ ని చూస్తే ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని కూడా ఔరా అనక మానడు.

చరణ్ కు సంబంధించిన ‘భీమ్ ఫర్ రామరాజు’ కి తారక్ వాయిస్ ఓవర్ అందించగా.. తారక్ కు సంబంధించిన ‘రామరాజు ఫర్ భీమ్’ కి చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అందులోనూ తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో కూడా చరణ్ ఈ టీజర్ కి డబ్బింగ్ చెప్పడం విశేషం. ఎంతో కాలంగా తారక్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ వీడియో ఎడారిలో ఒయాసిస్సులా కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఎన్టీఆర్ మాస్ ఎలివేషన్ సీన్స్ స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి చరణ్ వాయిస్ ఓవర్ తోడై ‘రామరాజు ఫర్ భీమ్’ ని అద్భుతంగా మలిచాయని చెప్పవచ్చు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఆకాశాన్ని దాటుకున్న అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.