ఆర్జీవీ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘రాము’ ఫస్ట్ లుక్…!

0

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. నా బయోపిక్ మూడు సినిమాలుగా రాబోతోందని.. మొదటి భాగం ”రాము – రామ్ గోపాల్ వర్మ ఆరంభం”.. రెండో భాగం ”రామ్ గోపాల్ వర్మ – అండర్ వరల్డ్ తో ప్రేమాయణం”.. 3వ పార్ట్ ”ఆర్.జి.వి – ది ఇంటెలిజెంట్ ఇడియట్” అనే కాన్సెప్ట్ తో రానున్నాయని.. మూడవ సినిమాలో స్వయంగా తాను నటిస్తానని పేర్కొన్నాడు. ఆర్జీవీ బయోపిక్ రామ్గోపాల్ వర్మ ఆధ్వర్యంలో దొరసాయి తేజ దర్శకత్వంలో తెరకెక్కనుంది. బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మించనున్నారు.

కాగా తాజాగా ఆర్జీవీ బయోపిక్ మొదటి భాగం ”రాము” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఆకాశంలో ఉరుములు మెరుపుల మధ్య రామ్ గోపాల్ వర్మ ఫేస్ ని చూపిస్తూ ‘రాము’ టైటిల్ పడేలా డిజైన్ చేసారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బొమ్మాకు మురళి మాట్లాడుతూ ”రామ్ గోపాల్ వర్మ నిజ జీవితాన్ని మూడు భాగాలుగా నిర్మించనున్నాం. ఒక్కొక్క భాగం 2 గంటల నిడివి ఉంటుంది. సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. మొదటి భాగంలో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక కొత్త నటుడు నటించబోతున్నారు. రెండో భాగంలో వేరే నటుడు నటిస్తారు. ఇక మూడో భాగంలో ఆర్జీవీ పాత్రలో స్వయంగా ఆర్జీవీయే నటిస్తారు” అని చెప్పుకొచ్చారు.