రానా ‘హిరణ్య కశ్యప’ కొత్త అప్ డేట్

0

అయిదు సంవత్సరాల క్రితం రానా హీరోగా హిరణ్య కశ్యప సినిమాను చేయబోతున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఏవో కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. అనారోగ్య కారణాల వల్ల రానా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ లకు పూర్తి స్థాయిలో హాజరు కాలేక పోయాడు. ఈ ఏడాదిలో హిరణ్య కశ్యపను పట్టాలెక్కించాలని భావిస్తున్న సమయంలో కరోనా వల్ల సినిమా ఆగిపోయింది. భారీ బడ్జెట్ తో రూపొందించాల్సిన హిరణ్య కశ్యప సినిమాను ఇప్పుడు తీయడం సాధ్యం కాదంటూ గుణశేఖర్ మరో సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

రానా కు హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ పై చాలా ఆసక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే మరీ ఆలస్యం చేయకుండా 2022లో మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అయితే ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్ స్టార్ వారు ఈ సినిమా నిర్మాణంలో మెజార్టీ భాగస్వామ్యం కలిగి ఉంటుందట.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఇప్పటికే కమిట్ అయిన ఒకటి రెండు సినిమాలు కూడా 2022 వరకు పూర్తి చేసి మరే ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా హిరణ్య కశ్యపను పాన్ ఇండియా మూవీగా చేయాలని రానా ఆశ పడుతున్నాడట. 200 కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ సినిమా రూపొందే అవకాశం ఉందంటున్నారు. ఈ లోపు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తీయబోతున్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా పట్టాలెక్కి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.