మరో టాక్ షో కు రానా సిద్దం

0

ఈమద్య కాలంలో స్టార్స్ అంతా కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ల వైపు అడుగులు వేస్తున్నారు. వారు చేస్తున్న షోలు మరియు ఇతర వెబ్ సిరీస్ లతో డిజిటల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రానా నెం.1 యారి అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ టాక్ షో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆ టాక్ షోలో పాల్గొని తమ అంతరంగంను ఆవిష్కరించారు. ఇప్పుడు రానా మరో టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో టాక్ షో ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

నెం.1 యారి తర్వాత రానా అంతకు మించిన టాక్ షోను ఒక ప్రముఖ ఓటీటీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. కేవలం తెలుగు స్టార్స్ మాత్రమే కాకుండా పలు భాషలకు చెందిన సెలబ్రెటీలను ఈసారి రానా టాక్ షో లో చూడబోతున్నాం. ఇటీవలే ఒక ఓటీటీ కోసం రానా మరియు వెంకటేష్ లు కలిసి కనిపించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. బాబాయి అబ్బాయి వెబ్ సిరీస్ లో కలిసి నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పష్టత రాకుండానే ఇప్పుడు రానా టాక్ షో కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య అనే సినిమాలో నటించగా అది విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు ఈయన్ను పవన్ కళ్యాణ్ చేయబోతున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో మరో హీరోగా నటించేందుకు సంప్రదించారట. మొత్తానికి బిజీ బిజీగా రానా అన్ని ప్లాట్ ఫామ్ లపై సందడి చేస్తున్నాడు.