గవాస్కర్ తో వివాదం: అనుష్క తప్పేం లేదన్న రవిశాస్త్రి

0

ఐపీఎల్ 2020 ప్రారంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఓటమి పాలయ్యింది. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘లాక్డౌన్లో విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మ తో ప్రాక్టీస్ చేశాడు.. అందుకే ఇప్పడు సరిగ్గా ఆడటం లేదు’ అంటూ గవాస్కర్ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ‘అనుష్క బౌలింగ్లో విరాట్ ప్రాక్టీస్ చేశాడు’ అని గవాస్కర్ అన్నాడు. కానీ కొన్ని వెబ్సైట్లలో మాత్రం ‘లాక్డౌన్లో కోహ్లీ అనుష్క బంతులతో ఆడాడు’ అంటూ వార్త వచ్చింది. ఈ వార్తలో డబుల్ మీనింగ్ ఉండటంతో అనుష్క తీవ్రంగా ఫైర్ అయ్యింది. ఇన్స్టా వేదికగా ఆమె గవాస్కర్ను తప్పుపట్టింది. తనపై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే తన వ్యాఖ్యలపై గవాస్కర్ వివరణ ఇచ్చాడు. తాను అలా అనలేదని చెప్పుకొచ్చాడు. కానీ అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది.

సోషల్ మీడియాలో కొంత మంది ఆకతాయిలు చేసిన పనికి.. ముందు వెనుకా ఆలోచించకుండా దిగ్గజ క్రికెటర్ను ఎలా తప్పుబడతావని అతని వయసుకైనా గౌరవం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు అప్పట్లో అనుష్క శర్మకు చురకలంటించారు. ఈ వివాదం అంతటితో సద్దుమణిగింది. కానీ తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఈ విషయాన్ని ప్రస్తావించగా.. రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? లేదా? అని నేను చెప్పలేను. కానీ అనుష్క మాత్రం స్పందించే హక్కు ఉంది. క్రికెటర్లు సరిగ్గా ఆడకపోతే వారి భార్యలను పరోక్షంగా ప్రస్తావించడం సరైనదని నేను అనుకోను. అనుష్క స్పందించడం కరెక్టే. ఈ విషయంలో ఆమెను తప్పు పట్టడం లేదు. గవాస్కర్ మాటలను మీడియా వక్రీకరించిందా లేదా? అనే విషయాలను మాత్రం నేను చర్చించదలుచుకోలేదు’ అని పేర్కొన్నాడు.