ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ ఓకే చేయడానికి కారణం అదేనా..?

0

‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రకటించబోతున్నారని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురించే అని ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా కోడై కూస్తోంది. ప్రభాస్ – ప్రశాంత్ కాంబోలో మూవీ రానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నప్పటికీ.. ‘కేజీఎఫ్’ మేకర్స్ ప్రకటనతో ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపు అయింది. ఈ క్రమంలో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమా ఆరేళ్ళ క్రితం వచ్చిన కన్నడ మూవీ ‘ఉగ్రమ్’ కు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. అలానే ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ అంగీకరించడానికి మరో కారణం కూడా ఉందని టాక్ నడుస్తోంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఉగ్రమ్’ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే స్టోరీ లైన్ ని ప్రభాస్ కి చెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. ఆల్రెడీ ప్రశాంత్ తీసిన సినిమానే కావడంతో ఈ సినిమా పై పూర్తి అవగాహన ఉంటుంది. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండటంతో చిత్రీకరణకు కూడా ఎక్కువ సమయం పట్టదు. ప్రస్తుతం ఉన్న బిజీలో తక్కువ కాల్షీట్స్ లోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చని భావించిన ప్రభాస్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ టాలీవుడ్ డెబ్యూగా వస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ తప్పించి మిగతా భాషల్లో రూపొందిస్తారట. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే రేపు మధ్యాహ్నం గం. 2:09 నిమిషాల వరకు ఆగాల్సిందే.