రోజు రోజుకు నీపై గౌరవం పెరుగుతోంది : క్రిష్

0

ప్రముఖ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ల కలయికలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ సీ బీ వారి నుండి డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు అందుకుని విచారణకు హాజరు అయ్యింది. తన హీరోయిన్ పై వచ్చిన డ్రగ్స్ కేసు ఆరోపణలు మరియు ఇతరత్ర విషయాలపై స్పందించేందుకు ఆసక్తి చూపించని దర్శకుడు క్రిష్ ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. విచారణ జరిగిన కొన్ని రోజుల వరకు రకుల్ ప్రీత్ సింగ్ కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఎట్టకేలకు ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యింది. షూటింగ్ కు కూడా జాయిన్ అవుతోంది.

తాజాగా రకుల్ తన పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్బంగా ఆమెకు ప్రముఖులు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే క్రిష్ చేసిన ట్వీట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. షూటింగ్ సెట్ లో ప్రతి రోజు మిమ్ములను చూస్తూ ఉంటే మీపై ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది. వర్క్ పట్ల మీ అంకితభావం మరియు ప్రతిభ క్రమశిక్షణతో నాకు మీపై ఉన్న అభిమానం పెరుగుతూనే ఉంది. నేను చూసిన వారిలో మీరు ఒక మంచి వ్యక్తి అంటూ క్రిష్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. చాలా రిజర్వ్ గా ఉండే క్రిష్ నుండి ఇలాంటి శుభాకాంక్షలు అందుకోవడం అంటే అది నిజంగా రకుల్ గొప్పతనంగా చెప్పుకోవచ్చు.