నగ్నత్వమే కానీ నగ్నసత్యం ఏం ఉంటుందని..!

0

ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ వరుసగా బయోపిక్ లు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కించారు. వాటిపై వివాదాల గురించి తెలిసిందే. అలాగే మారుతీరావు సహా పలువురిపై సినిమాలు తీస్తున్నారు. అదంతా సరే కానీ.. ఇప్పుడు ఏకంగా రామ్ గోపాల్ వర్మ తన బయోపిక్ ని తానే తెరకెక్కించే ప్రయత్నం చేస్తుండడం అగ్గి రాజేస్తోంది.

ఎప్పుడూ ఎవరో ఒకరి బయోపిక్ లు.. రియల్ స్టోరీలు తీస్తూ అందరికీ ముచ్చెమటలు పట్టించే ఆర్జీవీ ఇలా మారాడేంటి? అన్న చర్చా సాగుతోంది. అంతేకాదు.. ఈ బయోపిక్ లో మూడు భాగాలు ఉంటాయట. చివరి పార్ట్ లో ఆర్జీవీ నటిస్తారు. ఈ బయోపిక్ చిత్రానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారట. రెండు భాగాల్లో వేరే నటులు నటిస్తారు.. కానీ చివరి భాగంలో ఆర్జీవీయే స్వయంగా నటించనున్నారు. ఒక్కో భాగం రెండు గంటల నిడివితో ఉంటాయట.

ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. నా గురించి నగ్న సత్యాల్ని తీస్తానని అన్నారు. “ నా జీవితంలో నిజ ఘటనల్ని యథాతథంగా తీస్తాం. నాపై శిష్యులు బోలెడంత పరిశోధన చేసారు. మొదటి రెండు భాగాల్ని మించి 3వ భాగంలో నా చుట్టూ అలుముకున్న వివాదాలు.. శృంగార సన్నివేశాలు ఉంటాయి. నేను రంగుల జీవితాన్ని అనుభవించాను. కాబట్టి అమ్మాయిలతో పెట్టుకున్న సంబంధాలను కూడా చూపిస్తాను. సినిమాలో అదే ఎక్కువగా రక్తికడుతుంది“ అని అన్నారు.

2008 డిసెంబర్ లో ముంబై పేలుళ్ల అనంతరం తాజ్ హోటల్ కు రితేష్ నేను వెళ్లాం. అప్పుడేం జరిగిందనేది ఎవరికీ తెలీదు. వాటిని కూడా తెరపై నిజాయితీగా చూపిస్తాం. ఆ సమయంలో అక్కడికి వెళ్లడమే రాంగ్ అని అన్నారు.