నెట్టింట వైరల్ అవుతున్న వర్మ మర్డర్ సాంగ్..!!

0

ఇప్పటికే ‘నగ్నం’ ‘పవర్ స్టార్’ సినిమాలతో షాకిచ్చిన వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. తదుపరి సినిమా ‘మర్డర్’తో సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా సినిమాలను ప్రకటిస్తూ సినీ అభిమానులకు తన సినిమాల నుండి ఇంటరెస్ట్ పోకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన ఓ ప్రేమజంట కులాంతర వివాహం.. అదే ప్రణయ్ అమృతల లైఫ్ స్టోరీ ఆధారంగా మర్డర్ సినిమా ప్రకటించాడు. అంతేగాక ఈ సినిమాలో ప్రణయ్ మర్డర్ సన్నివేశాలను రియాలిటీకి దగ్గరగా చూపిస్తానని ఇప్పటికే చాలా పోస్టర్లు విడుదల చేసాడు వర్మ. అయితే ఈ మర్డర్ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేగాక ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచారు వర్మ. తన స్టైల్ లో సోషల్ మీడియాలో ప్రోమోట్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇప్పటికే అమృత తండ్రి మారుతీరావు ఆవేదన తెలుపుతూ ”పిల్లల్ని ప్రేమించడం తప్పా…?” అనే పాట విడుదల చేసి రచ్చలేపిన వర్మ.. తాజాగా మర్డర్ లోని సెకండ్ సాంగ్ విడుదల చేసాడు. ‘నచ్చినోన్ని పేమించడం తప్పా?’ అనే సాంగ్ అమృత యాంగిల్ నుండి విడుదల చేసాడు. ఈ సాంగ్ ప్రేక్షకులలో అనేక అనుమానాలకు తావిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇదివరకే ప్రణయ్ కుటుంబ సభ్యులు అమృత ఈ సినిమా పై అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. వారి అనుమతి లేకుండా వారి పేర్లను.. నిజజీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని ‘మర్డర్’ సినిమా రూపొందించి వారి పరువు తీస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఓ తండ్రి కూతురు మధ్య ఎమోషన్స్ మాత్రమే చూపిస్తానని వర్మ కూడా బల్లగుద్ది చెప్పాడు. నట్టి కరుణ క్రాంతి నిర్మాణంలో సినిమాను 5 భాషల(తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం)లో విడుదల చేయనున్నారు వర్మ టీం.