ఆర్జీవీ ‘అర్నబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ మోషన్ పోస్టర్…!

0

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో కూడా వరుసగా సినిమాలు తీస్తూ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఏటీటీ స్టార్ట్ చేసి ఇప్పటికే ‘క్లైమాక్స్’ ‘నగ్నం’ ‘పవర్ స్టార్’ సినిమాలను విడుదల చేసారు. వీటితో పాటు ‘మర్డర్’ ‘థ్రిల్లర్’ అనే సినిమాలు కంప్లీట్ చేసి.. ‘థ్రిల్లర్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని మీడియాలో విచారిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రముఖ జర్నలిస్టు రిపబ్లిక్ టీవీ ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని టార్గెట్ చేసారు వర్మ.

అర్నబ్ గోస్వామి బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నాడని.. అతనిపై ”అర్నబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్” అనే సినిమా తీస్తున్నానని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను బుధవారం రాత్రి 8.51 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘అర్నబ్ ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రారంభించే ప్రైమ్ టైమ్ షో ‘ది నేషన్ వాంట్స్ టూ నో’ అనే ప్రోగ్రాం ఆరంభానికి 9 నిమిషాల ముందు రిలీజ్ చేస్తానని.. అతి త్వరలో నేషన్ తెలుసుకోవాలనుకుంటున్న దాని వెనుక ఉన్న నిజం తెలుసుకోబడుతుందని’ వర్మ పేర్కొన్నాడు.

కాగా ఆర్జీవీ చెప్పినట్లే ”అర్నబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్” మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాడు. అర్నబ్ గోస్వామి ప్రొఫెషనల్ జీవితంపై వ్యంగ్యాస్త్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్నబ్ ని పోలిన వ్యక్తిని మోషన్ పోస్టర్ లో చూపించాడు వర్మ. అంతేకాకుండా చర్చా వేదికల్లో అర్నబ్ శైలిలో ”హూ ద హెల్ ఆర్ యూ.. హౌ డేర్ యూ” అనే మాటలు కూడా బ్యాగ్రౌండ్ లో వాడారు వర్మ. అయితే ఇప్పటి వరకు ఇది ఫిక్షనల్ స్టోరీ.. ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు.. కేవలం కల్పితం నిజ జీవిత వ్యక్తులను పోలి ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమే అని చెప్పుకొచ్చే ఆర్జీవీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా చెప్పలేదు. అందులోనూ డైరెక్టుగా అర్నబ్ పేరునే టైటిల్ గా పెట్టాడు. మరి అర్నబ్ గోస్వామి ఈ ఫస్ట్ లుక్ చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.