Templates by BIGtheme NET
Home >> Cinema News >> #RRR BGM కీరవాణి ముందు పెను సవాల్..!

#RRR BGM కీరవాణి ముందు పెను సవాల్..!


వెటరన్ సంగీత దర్శకుడిగా మరకతమణి ఎం.ఎం.కీరవాణి కెరీర్ జర్నీ ఎంతో ఆసక్తికరం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆయన ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంతింతై అన్న చందంగా ఎదిగారు. ఇళయరాజా లాంటి లెజెండ్ .. కాంపిటీటర్స్ ఎందరు ఉన్నా పోటీలో నిలదొక్కుకోగలిగారంటే ఆయనలో ఉన్న ప్రతిభా పాఠవమే అందుకు కారణం.

అయితే ఒకానొక దశలో ఏ.ఆర్. రెహమాన్ లాంటి యువ సంచలనం ఆరంగేట్రం చేయడంతో అప్పటివరకూ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లేవీ సంగీత ప్రియులకు అసలు వినిపించలేదు .. కనిపించలేదు. రెహమాన్ వేవ్ అంతటి గొప్ప ప్రభావాన్ని చూపించింది. ఈ విషయాన్ని కీరవాణి సైతం అంగీకరిస్తారు.

ఇక రెహమాన్ అందించే స్వరాలు.. బీజీఎం.. రీరికార్డింగ్ ఇవన్నీ సంచలనాలే. అంతర్జాతీయ స్థాయిని భారతీయ సినిమాకి సౌత్ సినిమాకి అందించిన గొప్ప సుస్వర మేధావి. మన సినిమాకి పాన్ ఇండియా రేంజ్ అప్పీల్ వచ్చింది కూడా ఆయన రాకతోనే. పాశ్చాత్య సంగీతాన్ని నట్టింటికి తెచ్చిన ఘనుడిగా రెహమాన్ ఖ్యాతి విస్తరించింది.

ఇక రెహమాన్ దేశభక్తి చిత్రాలకు అందించిన బీజీఎంలు హిస్టారికల్ అనే చెప్పాలి. ఆ బీజీఎంలు విన్న తర్వాత వేరొక బీజీఎం ఏదీ వినపడదు కనపడదు.. ఆ స్థాయిలో ఉంటుంది.

ఇప్పుడు ఎం.ఎం.కీరవాణి ముందు అలాంటి ఒక పెనుసవాల్ ఉందనే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. బీజీఎంని రెడీ చేశారని తెలిసింది. అయితే అది అంతర్జాతీయ స్థాయిని ప్రతిబింబించాలంటే రెహమాన్ గతంలో అందించిన బీజీఎంల స్థాయికి మించిపోవాలి. కీరవాణి అంతర్జాతీయ మ్యూజిక్ బృందంతో కలిసి పని చేశారు కాబట్టి ఆ స్థాయిని మించుతారనే అభిమానులు భావిస్తున్నారు.

చిత్రబృందం నుండి వినిపిస్తున్న గుసగుస ప్రకారం..ఆర్.ఆర్.ఆర్ కి కంపోజిషన్లు దాదాపు పూర్తయ్యాయి. పాన్ ఇండియా ఆర్.ఆర్.ఆర్ కి కీరవాణి ఘనమైన బిజిఎం ఇచ్చారని తెలుస్తోంది. దేశభక్తి డ్రామా కాబట్టి ఇందులో బీజీఎం ఎంతో కీలకం. పాటలు అందుకు తగ్గట్టు కుదరాలి. కీరవాణి హాలీవుడ్ స్ఫూర్తితో అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చారన్నది ఇన్ సైడ్ గుసగుస. అయితే రిలీజ్ తర్వాత ప్రేక్షకులే దానిని డిసైడ్ చేయాలి. ఇది రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన రెహమాన్ `భారతీయుడు` రేంజ్ ఆర్.ఆర్ లా లేదు. ఆ రేంజు బీజీఎం లేదు! అని విమర్శలొచ్చినా ఫెయిలైనట్టే. ఈ సవాల్ ని కీరవాణి ఎలా స్వీకరించారు? అన్నది వేచి చూడాలి.

తెలుగు-తమిళ్-హిందీ తో పాటు ప్రపంచ మార్కెట్లో ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్. ఈసారి ఆయనా అంతర్జాతీయ మార్కెట్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ .. టెక్నికాలిటీస్ ప్రతిదీ ఇంపార్టెంట్. మ్యూజిక్ ఆర్.ఆర్ పాశ్చాత్య పంథాలో హిస్టారికల్ గా ఉండాలి. అందుకోసం కీరవాణితో కలిసి జక్కన్న ఎంతో శ్రమించారని తెలుస్తోంది. ఇక బ్రిటీష్ భామను పరిచయం చేసేందుకు ఆంగ్ల గీతం కూడా ఇందులో వినిపిస్తుందట.