రూల్స్ పక్కన పెట్టేసిన రాజమౌళి.. చెర్రీ ఎన్టీయార్ ఫ్రీబర్డ్స్

0

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే హీరోలకు ఎన్ని కండీషన్లు ఉంటాయో తెలిసిందే. అందులో ప్రధానమైంది.. తన సినిమా షూటింగ్ పూర్తయి విడుదలయ్యేంత వరకూ హీరో మరో సినిమా అంగీకరించకూడదు. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఇటు రామ్ చరణ్ అటు ఎన్టీఆర్ కు సైతం ఇవే కండీషన్స్ అప్లై అయ్యాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అలా 2018 నవంబర్ లో మొదలయ్యింది. అయితే.. రాజమౌళి టేకింగ్ గురించి తెలియని కాదు. ఏ చిన్న కరెక్షన్ కనిపించినా.. దాన్ని సరి చేసుకునేంత వరకూ ఊరుకోడు. అందుకే ఆయన సినిమాలు ఆలస్యంగా రిలీజ్ అవుతుంటాయి. బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాయి. ఈ సినిమాకు కరోనా అవాంతరం రావడంతో మరింత ఆలస్యమైంది. ఈ సమ్మర్ నాటికి ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అయితే.. ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందే రామ్ చరణ్ ఎన్టీఆర్ లకు కూడా వేరే సినిమాలో నటించొద్దని కండిషన్ పెట్టాడు రాజమౌళి. దీంతో మూడేళ్లకు పైగా ఈ ఇద్దరు హీరోలు ఈ ప్రాజెక్టులోనే చిక్కుకుపోయారు. అయితే.. మొదట్లో ఈ సినిమా విడుదల అయ్యే వరకు వేరే సినిమా చెయ్యకూడదన్న రాజమౌళి.. ఆ తరువాత షూటింగ్ పూర్తి అయ్యే వరకు వేచి చూస్తే చాలు అని కండిషన్ సడలించాడు. లేటెస్ట్ గా ఇంకొంచెం రూల్స్ సడలించిన దర్శకధీరుడు.. షూటింగ్ పూర్తి కాకుండానే రామ్ చరణ్ ని ఆచార్యలో అడుగుపెట్టేందుకు పర్మిషన్ ఇచ్చాడు.

అవసరమైనప్పుడు తనకు అందుబాటులో ఉండాలనే కండీషన్ తో ఆచార్యలో నటించేందుకు అవకాశం అనుమతించాడు. దాని ప్రకారం ఈ నెల మూడో వారంలో మూడు రోజుల పాటు ఆచార్య షూటింగ్ కు డేట్స్ కేటాయించాడు చెర్రీ. ఈ షూట్ లో చరణ్ మీద సోలో సీన్లు చిత్రీకరిస్తారు. ఫిబ్రవరిలో చిరంజీవి కాంబినేషన్లో వచ్చే సీన్లు షూట్ చేస్తారు. మార్చిలో మరికొంత షూట్ చేస్తారు. మధ్య మధ్యలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా చేస్తాడు చెర్రీ. అయితే.. డేట్స్ విషయంలో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం రాజమౌళికే ఇవ్వాలన్నది కండిషన్. ఆ విధంగా రూల్స్ పక్కన పెట్టిన దర్శకధీరుడు.. తన హీరోలకు ఫ్రీడమ్ ఇచ్చాడన్నమాట.