మెగా మేనల్లుడుతో మూవీ ప్లాన్ చేస్తున్న బండ్ల గణేష్…?

0

హాస్యనటుడు బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మారి పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజతో ‘ఆంజనేయులు’.. పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’ మరియు ‘గబ్బర్ సింగ్’.. అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’.. రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’.. ఎన్టీఆర్ తో ‘బాద్ షా’ మరియు ‘టెంపర్’ వంటి సినిమాలు తీసాడు. 2015లో వచ్చిన ‘టెంపర్’ సినిమా తర్వాత బండ్ల మరో మూవీని ప్రొడ్యూస్ చేయలేదు. అయితే ఐదేళ్ల తర్వాత మళ్ళీ నిర్మాతగా బిజీ అవ్వాలని బండ్ల గణేష్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు తెలియనప్పటికీ పవన్ లైన్లో పెట్టిన సినిమాలలో ఇది కూడా ఒకటని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లతో కూడా బండ్ల గణేష్ సినిమాలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ముగ్గురు మెగా హీరోలకి అడ్వాన్సులు కూడా ఇచ్చేసిన బండ్ల గణేష్.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కూడా సినిమా చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాడట. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని విడుదలకి సిద్ధం చేశాడు తేజ్. అలానే ‘ప్రస్థానం’ దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ఇటీవలే కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నట్లు ప్రకటించాడు. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్న సాయి తేజ్ ఇంకా బండ్ల గణేష్ బ్యానర్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్. ఏదేమైనా బండ్ల గణేష్ మళ్ళీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు తీసి ‘గబ్బర్ సింగ్’ రేంజ్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.