ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో సలార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 22న స్క్రీన్ మీద బొమ్మ ఎప్పుడు పడుతుందా? ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవుతాయా అంటూ రెడీ గా ఉన్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఓ రేంజ్ లో ఈ సినిమాపై హైప్ పెరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ ఖాన్సార్ రాజ్యంలో జరిగే కథగా ఉండబోతోందని ట్రైలర్ బట్టి క్లారిటీ వచ్చింది.
అయితే కేజీఎఫ్ రెండు పార్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రభాస్ తో నీల్ సినిమా ప్రకటించిన నుంచి నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కేజీఎఫ్ కు సలార్ కు కనెక్షన్ ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. ఈ మూవీలో యశ్ ఎంట్రీ కూడా ఉంటుందని అంతా భావించారు.
అందుకు ఉదాహరణగా జులై8వ తేదీన విడుదలైన సలార్ టీజర్ లోని కొన్ని సన్నివేశాలను చెప్పారు. కేజీఎఫ్-2లో రాకీభాయ్పైన క్లైమాక్స్లో జరిగిన దాడి.. సలార్ టీజర్ విడుదలైన టైమ్ కూడా ఒకటేనని ఫ్యాన్స్ తెలిపారు. అయితే సలార్ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీటిన్నంటిపై స్పందించారు. సలార్-కేజీఎఫ్ కనెక్షన్ పై పెదవి విప్పారు.
“కేజీఎఫ్ తో గానీ, కేజీఎఫ్ యూనివర్స్ తో గానీ సలార్ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని తాను ముందే బయట పెట్టాల్సింది. ఇది నా తప్పే. ఫ్యాన్స్ ప్రకారం చూస్తుంటే కేజీఎఫ్ చాలా పెద్ద సినిమా అని అర్థం చేసుకున్నా” అని దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో సలార్ స్క్రిప్ట్ కేజీఎఫ్ విడుదలకు ముందే సిద్ధమైందని చెప్పారు. కేజీఎఫ్ సక్సెస్ సలార్ స్క్రిప్ట్ పై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు.
మరోవైపు, కేజీఎఫ్ సూపర్ రికార్డును సలార్ బద్దలగొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.170 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే సలార్ మూవీపై ఉన్న హైప్ ను చూస్తుంటే ఈ రికార్డు బద్దలు కావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. రూ.170 కోట్ల మార్క్ ను అందుకుంటే మాత్రం 2023లో హైయెస్ట్ గ్రాస్ అందుకున్న మూవీగా సలార్ నిలిచిపోతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.