సంజయ్ దత్ జీవితమంతా గందరగోళమే

0

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్య విషయం తెలిసి బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు మరియు ఇతర భాషల సినిమా ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ మూడవ స్టేజ్ లో ఉందని వైధ్యులు గుర్తించారట. అమెరికాకు సంజయ్ దత్ ట్రీట్మెంట్ కోసం వెళ్లబోతున్నాడు. ఈ సమయంలో సంజయ్ దత్ తో తమకు ఉన్న అనుబంధాన్ని బాలీవుడ్ నటీనటులు షేర్ చేసుకుంటూ ఉన్నారు.

సంజయ్ దత్ కెరీర్ ఆరంభం నుండి ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. బ్యాడ్ బాయ్ అనే ఇమేజ్ ను మూట కట్టుకున్న సంజయ్ దత్ బాంబు పేళుడు కేసు నుండి డ్రగ్స్ కేసు వరకు ఎన్నో కేసుల్లో నింధితుడిగా ఉన్నాడు. కొన్ని కేసుల్లో దోషిగా తేలడంతో జైలు శిక్ష కూడా అనుభవించిన విషయం తెల్సిందే. సినీ జీవితం మరియు వ్యక్తిగత జీవితం మొదటి నుండి కూడా గందరగోళంగా సాగుతూ వచ్చింది.

జైలు నుండి విడుదల అయిన తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్న సమయంలో అనూహ్యంగా ఈ అనారోగ్యం ఆయన్ను ఇబ్బందికి గురి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు సంజయ్ దత్. దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కేజీఎఫ్ 2 చిత్రంలో అత్యంత భయంకరమైన పాత్ర అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. సడక్ 2 లో కూడా సంజయ్ దత్ నటిస్తున్నాడు. నటుడిగా బిజీగా ఉన్న ఈ సమయంలో ఇలా క్యాన్సర్ బారిన పడటంతో మళ్లీ ఆయన కెరీర్ గందరగోళంలో పడ్డట్లయ్యింది.