సాయిపల్లవి సారంగ ‘ధరువు’ కేక.. దుమ్ములేపనున్న సాంగ్!

0

సాయిపల్లవి.. సినిమాల కోసం డ్యాన్స్ నేర్చుకున్న హీరోయిన్ కాదు.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిన తర్వాతే సినిమాల్లోకి వచ్చింది. అందుకే.. సినిమా ఏదైనా ఈ నేచురల్ బ్యూటీ స్టెప్పులు కేక పెట్టిస్తుంటాయి. వెండి తెరపై ఈ అమ్మడి డ్యాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో గత చిత్రాలే చెబుతాయి. అయితే.. ఇప్పుడు రాబోతున్న సినిమాలోనూ సాయిపల్లవి డ్యాన్స్ చర్చనీయాంశమవుతోంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె. నారాయణదాస్ నారంగ్ పి. రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్. కాగా.. విడతల వారీగా ఈ చిత్రానికి సంబంధించిన పాటలను రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా మూడో పాటను రేపు (ఫిబ్రవరి 28) రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని ఈ సాంగ్ ను విడుదల చేయనున్నారు. అయితే.. ‘సారంగ ధరియా..’ అంటూ సాగే ఈ పాట మరో ‘ఫిదా’ సాంగ్ కాబోతోందనే మాట వినిపిస్తోంది. అసలు.. ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు మేకర్స్.

నిర్మాతలు కె.నారాయణదాస్ నారంగ్ పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదేరీతిన ‘లవ్ స్టోరి’ చిత్రంలోనూ పాటలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పవన్ సీహెచ్ మంచి మ్యూజిక్ అందించారు.’’ అని చెప్పారు.

ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయని అన్నారు. ‘‘తొలి పాటగా వచ్చిన ‘హే పిల్లా..’ దాదాపు 15 మిలియన్ల వ్యూస్ సాధించింది. ‘నీ చిత్రం చూసి’ అనే రెండో పాటకు 3 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. రిలీజ్ కాబోతున్న మూడో పాట ‘సారంగధరియా..’ సినిమాకే హైలైట్ కాబోతోంది. ఈ పాటలో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులు వేశారు’’ అని అన్నారు నిర్మాతలు.